Anitha: ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లతో జగన్ కుట్ర

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత పదిరోజులుగా భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలోనే ఉండి సహాయక చర్యలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షించారని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా సహాయం అందింస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
ఈరోజు(మంగళవారం) విశాఖపట్నంలో హోంమంత్రి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ...జగన్ రెండుసార్లు బయటికి వచ్చి తమ ప్రభుత్వంపై బురదజల్లి వెళ్లిపోయారని ఆరోపణలు చేశారు. ప్రకాశం బ్యారేజీకి పూర్తిస్థాయిలో వరద చుట్టూ ముడుతుంటే, దానిని కూడా డిస్ట్రబ్, విధ్వంసం చేయడానికి జగన్, వైసీపీ నేతలు ప్రయత్నాలు చేశారని విమర్శలు చేశారు. ఏపీలో విధ్వంసం సృష్టించడానికి బోట్లను, వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారని అన్నారు. ప్రకాశం బ్యారేజీ పిల్లర్లను ఢీ కొట్టి ప్రమాదం జరిగితే, కొన్ని వేల మంది ప్రాణాలు పోయేవని హోం మంత్రి వంగలపూడి అనిత ఆందోళన వ్యక్తం చేశారు.
ఉద్దండ రాయపురంలో ఉన్న బోట్లు అక్కడికి ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈరోజు వరకు బోట్లు పోయాయని ఎవరు ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు. వైసీపీ నేతలు నందిగామ సురేష్, తలసీల రఘురాం అనుచరులకు చెందిన బోట్లతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. క్రిమినల్ మైండ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఆలోచించరనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేషాలు వేసిన అవి వర్కౌట్ కాలేదని అన్నారు. విపత్కర సమయంలో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూడటం దారుణమని అన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చినప్పటికీ.. జగన్‌కు ఇంకా బుద్ధి రావడం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశద్రోహం కేసు జగన్ మోహన్ రెడ్డిపై పెట్టాలని అన్నారు. సమాజంలో తిరిగే అర్హత ఆయనకి లేదని హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com