Anitha : ట్రాఫిక్ పోలీస్ పై హోంమంత్రి అనిత ప్రశంసల వర్షం

కృష్ణా జిల్లాకు చెందిన ఓ ట్రాఫిక్ పోలీస్ అధికారి చూపిన మానవత్వంపై రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రశంసల వర్షం కురిపించారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు, పేదల పట్ల కరుణ చూపిన పెనమలూరు ట్రాఫిక్ పోలీస్ వెంకటరత్నం అసలైన హీరో అని ఆమె కొనియాడారు. ఆయన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే, కృష్ణా జిల్లా పెనమలూరు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న వెంకటరత్నం, చెప్పులు లేకుండా నడుస్తున్న కొందరు నిరుపేద చిన్నారులను చూసి చలించిపోయారు. వెంటనే స్పందించి, తన సొంత డబ్బుతో వారికి కొత్త చెప్పులు కొనిచ్చి తన ఉదారతను చాటుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా హోంమంత్రి దృష్టికి వెళ్లింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, వెంకటరత్నం చర్య ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సరైన అర్థం చెప్పిందని అన్నారు. పేద పిల్లల కష్టాలను చూసి మానవత్వంతో స్పందించిన తీరు అభినందనీయమని తెలిపారు. "వెంకటరత్నం గారు.. మీ అమూల్యమైన సేవలకు హ్యాట్సాఫ్" అని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదం కారణంగా నేరాల రేటు తగ్గుతోందని, పోలీసుల కృషికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆమె వివరించారు. ఓ వైపు విధులను సమర్థంగా నిర్వహిస్తూనే, మరోవైపు మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న పోలీసు సిబ్బందిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com