AP: వేలాది ఎకరాల్లో పంట నష్టం

ఉత్తరాంధ్రలో కురిసిన భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 3,508 హెక్టార్లు, శ్రీకాకుళంలో 1,223 హెక్టార్లు, విజయనగరంలో వెయ్యి ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలకు 38 ఇళ్లు దెబ్బతిన్నాయి. 17 చెరువులకు గండ్లు పడగా, 8 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. విజయనగరం సర్కిల్ పరిధిలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రూ. 21 లక్షల నష్టం వాటిల్లింది. జిల్లాలో రాష్ట్ర హైవే 68 కి.మీ, ఆర్‌అండ్‌బీ రోడ్లు 67 కి.మీ దెబ్బతినగా, మరమ్మతులకు రూ. 4 కోట్లు, శాశ్వత పనులకు రూ. 12 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర రహదారులు 55 కి.మీ, ఆర్‌అండ్‌బీ రహదారులు 108 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి.
జలాశయాలకు భారీగా వరద
అనకాపల్లి జిల్లా తాండవ జలాశయం ప్రమాదకరస్థాయికి చేరింది. అమ్మపేట, కొత్తమల్లంపేట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. కోనాం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరింది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని తాటిపూడి జలాశయం నుంచి 350 క్యూసెక్కులు కిందకు వదలటంతో భీమిలి వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మడ్డువలస జలాశయం 8 గేట్ల ద్వారా 17 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళంలోని వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో భారీగా వరద చేరుతోంది. విశాఖలోని మేఘాద్రి జలాశయం నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
రాకపోకలకు అంతరాయం
సీలేరు-దుప్పిలవాడ మధ్యలో అంతర్రాష్ట్ర రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. 16 కి.మీ. రహదారిలో 12 చోట్ల రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే ప్రధాన మార్గంలో మడిగుంట, చింతలూరు, చింతపల్లి సమీపంలోని అంతర్ల, పెంటపాడు వద్ద భారీ వంతెనల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్లు ఏర్పాటు చేశారు. మడిగుంట, పెంటపాడు వద్ద నిర్మించిన వంతెనలు కొట్టుకుపోయాయి. గూడెంకొత్తవీధి మండలం చామగెడ్డ వద్ద వంతెన నేలమట్టమైంది. గూడెంకొత్తవీధి నుంచి సీలేరు మార్గంలో మూడు చోట్ల వంతెనలు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారిపై పెద్దఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. సీలేరునుంచి గూడెంకొత్తవీధికి రాకపోకలు స్తంభించాయి. అనకాపల్లి జిల్లా ఖండివరం-మాడుగుల రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయి.. రోడ్డుకు భారీ గండి పడింది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లైదాం వద్ద రెల్లిగడ్డ పొంగి విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నుంచి 30 గ్రామాలకు, పొందూరు-శ్రీకాకుళం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com