RAINS: ఆంధ్రప్రదేశ్‌లో లక్ష ఎకరాల్లో పంట నష్టం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. లక్ష ఎకరాల్లో పంట నీట మునిగింది. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్నాయి. వర్ష ప్రభావం తక్కువగానే ఉన్నా.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉద్దృతి పెరిగింది. ఏలూరు, తూర్పుగోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాల్లోని వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో యువకుడు నీటమునిగి మరణించాడు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు ఇళ్లు కూలి దుర్మరణం చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జి.మాడుగులలో ఇంటిగోడ కూలి ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. హుకుంపేటలో పాఠశాల భవనంపై చెట్టు కూలింది. పాఠశాలలకు ముందే సెలవు ప్రకటించడంతో ప్రమాదం తప్పింది.
ధవళేశ్వరం వద్ద 4.09 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. రేపు ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదిలో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరిగింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు నీటి ప్రవాహం కొనసాగుతోంది. తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోనే 195 గ్రామాలపై వరద ప్రభావం అధికంగా ఉందని.. అధికారులు అంచనా వేశారు. 25 పశువులు కొట్టుకుపోవడంతోపాటు పదుల సంఖ్యలో గృహాలు దెబ్బతిన్నాయి. రెండు జిల్లాల్లో 3 చోట్ల పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి 776 మందిని తరలించారు. 600 కి.మీ. పైగా రోడ్లు దెబ్బతిన్నాయి. 250పైగా విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు వాగు ముంపులో వరి పొలాలు సర్వం కోల్పోయారు. తెలంగాణలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో.. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాల్లోకి వరద ముంచెత్తింది. కొన్నిచోట్ల ఇళ్లు, వాటిల్లోని సామగ్రి, పశువులు కొట్టుకుపోయాయి. వందల ఇళ్లలో బురద పేరుకుపోయింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట పొలాల్లోనూ ఇసుక మేట వేసింది. సుమారు 8వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా. ఈ ఏడాదికి పంట వేసే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఇసుక మేటలు తీసే దాకా సాగు కష్టమని వివరిస్తున్నారు. ఏలూరు జిల్లాలో గండిపోచమ్మ ఆలయం పూర్తిగా నీటమునిగింది. బుట్టాయగూడెం మండలం గుబ్బలమంగమ్మ గుడి పైనుంచి వరద ప్రవహిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచింది. కొన్నిచోట్ల ఇంకా పునరుద్ధరించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com