FLOODS: ఏలేరు జలశాయానికి పోటెత్తిన వరద
కాకినాడ జిల్లా ఏలేరు కాల్వకు భారీగా వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ఏలేరు జలాశయం నుంచి 27వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 46వేల క్యూసెక్కుల వరద ఏలేరు జలాశయంలో చేరుతోంది. దీని ప్రభావం జిల్లాలోని 10 మండలాల పరిధిలోని 86 గ్రామాలపై పడింది. ఇప్పటికే ఆయా గ్రామాలు, కాలనీలను వరద చుట్టుముట్టింది. ఏలేశ్వరం, కిర్లంపూడి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంట నీటమునిగింది. కిర్లంపూడి మండలం రాజుపాలెం, ఎస్ తిమ్మాపురం, గోపాలపట్నం, సుందరాయనపాలెం గ్రామాలు ఏలేరు వరద ముంపులో ఉన్నాయి.
1622 హెక్టార్లలో పంట మునక
ఏలేరు ప్రాజెక్టు వరద జలాల విడుదలతో జలాలు పోటు ఎత్తడంతో ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. వరదలకు, పెద్దాపురం నియోజకవర్గంలో 18 గ్రామాలలో 1622 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట వద్ద అప్రోచ్ బ్రిడ్జ్ కొట్టుకుపోగా వీకే రాయపురం ఏటిగట్టుకు గండి పడే ప్రాంతాన్ని అధికారులు పూడ్చారు.
ఏలేరు కాల్వకు గండి
ఎస్ తిమ్మాపురం, రాజుపాలెం గ్రామాల వద్ద ఏలేరు కాల్వకు గండి పడడటంతో భారీగా వరద గ్రామాలను ముంచెత్తింది. దీంతో ఇళ్లు, పంట పొలాల్లోకి వరద చేరింది. దీంతో గ్రామాల నుంచి బయటకు వచ్చే మార్గంలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాజుపాలెంలో 2.కి.మీ మేర రహదారిపై వరద ప్రవహిస్తోంది. ప్రత్తిపాడు-సామర్లకోట మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. గోపాలపట్నం, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోనూ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అధికారులు 35 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 500 మందిని అక్కడికి తరలించారు. మరోవైపు ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు దిగనున్నాయి.
గ్రామాలను ముంచెత్తిన వరద
జగ్గంపేట నియోజకవర్గంలోని రాజుపాలెం, ముక్కొల్లు తదితర గ్రామాలను ఏలేరు వరద ముంచెత్తింది. గ్రామాల్లోని పంట పొలాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఆయా గ్రామాలకు వరద ఉద్ధృతి పెరగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com