KHAMMAM: ఖమ్మంలో ఎటుచూసిన విలయమే

ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రాంతాలపై అనూహ్యంగా విరుచుపడిన భారీ వర్షం అన్ని వర్గాలను అతలాకుతలం చేసింది. ఆకలి కేకలతో ప్రజలు అల్లాడుతున్నారు. వరద బాధిత ప్రాంతాలైన ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని పలుప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షం వెలిసి, వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో బాధితులు కాళ్లూ.. చేతులు కూడదీసుకుని ఇళ్లకు చేరుతున్నారు. బురద నిండిన ఇళ్లను, ఇసుక మేటలో రూపుమారిన పొలాలను, కొట్టుకుపోయిన రోడ్లను చూస్తూ హతాశులవుతున్నారు. ఖమ్మంపై మున్నేరు ఆదివారం తెల్లవారుజామున సునామీలా విరుచుకుపడగా... ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. తమ వీధులను, ఇళ్లను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రతి నివాసంలోనూ రెండు నుంచి నాలుగు అడుగుల మేర ఒండ్రు మట్టి మేటలు వేసింది.
ఖమ్మంలోకి మున్నేరు అడుగుపెట్టే ప్రాంతంలోనే... పోలేపల్లి పంచాయతీలో రాజీవ్ గృహకల్ప సముదాయాలు ఉంటాయి. వరద పోటు మొదట ఈ బస్తీనే తాకడంతో ఒక్క ఇంట్లోనూ వస్తువు మిగల్లేదు. కట్టుబట్టలతో బయటపడిన జనానికి చివరికి అవే మిగిలాయి. సాయినగర్, వెంకటేశ్వర కాలనీ, బొక్కలగడ్డ తండా, మోతీనగర్, జలగంనగర్ ఇలా వరుస పెట్టి ఊరూవాడను వరద ఊడ్చేసింది. వేల నివాసాలు.. లక్షకు పైగా జనం.. బాధితులుగా మారారు. రాజీవ్ గృహకల్పలోని 33 బ్లాకుల్లోని 720 నివాసాలకు వరద నష్టం చేసింది. కిలోమీటర్ల వేగంతో వరద తాకడంతో మూడంతస్తులు ఉండే బ్లాకులు కంపించాయి. ఒక్కో బ్లాకులో కనీసం ఇరవైకిపైగా గృహాల గోడలు బీటలువారాయి. దర్వాజలు, తలుపులు, కిటికీలు కొట్టుకుపోయాయి. గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలు, మంచాలు, పరుపుల ఆచూకీ లేదు.
పునరావాస శిబిరాల్లో మాత్రమే ఆహారం ఇస్తుండటంతో కాలనీల్లోని తమ ఇళ్లకు చేరుకున్న కొన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. అక్కడికి శిబిరాలకు కిలోమీటర్ల దూరం ఉండటం, రోడ్లపై ఒండ్రు మేటలు ఉండటంతో వాహనాలు కదలడంలేదు. దీంతో దాతలు ఇస్తున్న పులిహోర, అన్నం, కూరలు పొట్లాలపై ఆధారపడుతున్నారు. రోగగ్రస్తులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులకు ఆహారం సరిగా అందడం లేదు.విద్యార్థులు, ఉద్యోగుల ధ్రువపత్రాలు, పట్టాలు, బ్యాంకు దస్త్రాలు, స్టాంపు పేపర్లు, వైద్య పరీక్షల రిపోర్టులన్నీ వరదలో కలిసిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com