LOKESH: 142వ రోజుకు చేరిన పాదయాత్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఇవాల్టితో పాదయాత్ర 142 రోజుకు చేరింది. ప్రస్తుతం తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్ ప్రజల సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా బల్లవోలు గ్రామస్తులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని.. అందులో సిలికా ఖనిజం అధికంగా ఉందని వివరించారు. అయితే పేదలకు ప్రభుత్వం డీకేటీ పట్టాలను పంపిణీ చేసిందని గుర్తుచేశారు. ఈ క్రమంలో చిల్లకూరు, కోట మండలాల్లోని గ్రామాల్లో సిలికాను తవ్వుకునేందుకు ప్రభుత్వం 84 మందికి లీజులకు అనుమతులు మంజూరు చేసిందన్నారు. అయితే జగన్ సీఎం అయినప్పటి నుంచి తమనే కాకుండా సిలికా లీజుదారులను కూడా ఇబ్బందులు పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పంచాయతీ తీర్మానం లేకుండా శేఖర్ రెడ్డి అనే వ్యాపారికి అప్పజెప్పారంటూ బల్లవోలు గ్రామస్తులు వాపోయారు. ఇప్పుడు భూములు ఇవ్వాలంటూ శేఖర్ రెడ్డి తమను ఒత్తిడి చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిబంధనలకు మించి సిలికాను తవ్వడం వల్ల పంటలకు సాగునీరు దొరికే పరిస్థితి లేకుండా పోయిందని గోడు వెల్లబోసుకున్నారు.
అక్రమ సిలికా విక్రయాల ద్వారా జగన్ సర్కార్ 5వేల కోట్లు దోచుకుందని లోకేష్ ఆరోపించారు.ఎలాంటి బిల్లులు లేకుండా సిలికాను చెన్నైకి తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. అధికారంలోకి రాగానే వాస్తవ లీజుదారులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. అక్రమ సిలికా తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తాం రైతుల సాగుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని వారికి భరోసా కల్పించారు. ఆ తర్వాతా నారా లోకేష్‌ను తిక్కవరం గ్రామస్తులు కలిశారు.వైసీపీ నేతలు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు చెందిన భూములను కబ్జా చేశారని ఆరోపించారు.ఉపాధి హామీ పథకాన్ని అడ్డు పెట్టుకుని పేదల భూముల్లో అనుమతి లేకుండా అక్రమంగా గ్రావెల్, మట్టి తవ్వుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రావెల్ దోపిడీని నిలదీసిన వారిపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు.. గ్రామంలోని ఏడుగురు నాయకులు 30 ఎకరాలు దోచుకున్నారని లోకేష్‌కు వివరించారు..
అంతకముందు నారా లోకేష్ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. ఏపీని గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చిన ఘనుడని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీలో,ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో గంజాయి దొరుకుతుందన్నారు. ఈ సైకో ప్రభుత్వంలో అంతలా గంజాయి సాగు జరుగుతుందన్నారు.గంజాయి మత్తులో విద్యార్థులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధిరంలోకి రాగానే గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు.యువత తప్పుదారి పట్టకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధిస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com