Aviation India : ఆకాశమే హద్దుగా భారత్..15 ఏళ్లలో 1500 కొత్త విమానాలు..ఇక దుబాయ్, దోహాలకు చెక్.

Aviation India : ఆకాశమే హద్దుగా భారత్..15 ఏళ్లలో 1500 కొత్త విమానాలు..ఇక దుబాయ్, దోహాలకు చెక్.
X

Aviation India : రాబోయే కొన్నేళ్లలో మీ విమాన ప్రయాణం పూర్తిగా మారిపోనుంది. విదేశాలకు వెళ్లాలంటే దుబాయ్, దోహా వంటి నగరాల్లో గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా భారత్ ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. రాబోయే 15 ఏళ్లలో ఏకంగా 1500 కొత్త విమానాలను భారత విమానయాన సంస్థలు తమ అమ్ములపొదిలో చేర్చుకోబోతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని వెల్లడించారు.

భోగాపురం ఎయిర్‌పోర్టులో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి రామ్ మోహన్ నాయుడు భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రస్తుతం మన దేశంలో 843 విమానాలు ఉండగా, గత ఏడాది 80 విమానాలను చేర్చుకున్నాం. ఈ ఏడాది ఆ సంఖ్యను 106కు పెంచబోతున్నాం. ఇలా రాబోయే 15 ఏళ్లపాటు ప్రతి ఏటా సగటున 100 కొత్త విమానాలను కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి దిగ్గజ సంస్థలతో పాటు స్టార్ ఎయిర్ వంటి చిన్న సంస్థలు కూడా తమ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తున్నాయి.

మన భారతీయులు అమెరికా లేదా యూరప్ వెళ్లాలంటే ప్రస్తుతం ఎమిరేట్స్ లేదా ఖతార్ ఎయిర్‌వేస్ వంటి విదేశీ సంస్థలపై ఆధారపడుతున్నారు. దీనివల్ల ప్రయాణికులు దుబాయ్ లేదా సింగపూర్‌లో విమానాలు మారాల్సి వస్తోంది. తద్వారా ఆయా దేశాల విమానశ్రయాలకు భారీ ఆదాయం వెళ్తోంది. ఈ పరిస్థితిని మార్చడానికి భారత్‌లోనే గ్లోబల్ హబ్‎లను తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మన విమానయాన సంస్థలే నేరుగా విదేశాలకు నాన్-స్టాప్ విమానాలను నడిపేలా ప్రోత్సహిస్తోంది.

సుదూర ప్రయాణాలు చేసే భారీ వైడ్ బాడీ విమానాల విషయంలో మనం ప్రస్తుతం కొంత వెనుకబడి ఉన్నాం. ఉదాహరణకు ఎమిరేట్స్ వద్ద 250 భారీ విమానాలు ఉంటే, మన దగ్గర ఆ సంఖ్య చాలా తక్కువ. అయితే టాటా గ్రూప్ చేతిలోకి ఎయిర్ ఇండియా వెళ్ళాక, వందల సంఖ్యలో భారీ విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చారు. ఇండిగో కూడా తన విదేశీ మార్కెట్‌ను పెంచుకోవడానికి సిద్ధమవుతోంది. త్వరలోనే భారతీయ విమానాలే ప్రపంచం నలుమూలలకూ నేరుగా ఎగిరే రోజులు రాబోతున్నాయి.

Tags

Next Story