రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ విషయంలో సీఐడీది అత్యుత్సాహమా?

రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ విషయంలో సీఐడీది అత్యుత్సాహమా?
స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ ఉండగా, కేవలం డైరెక్టర్‌గా వ్యవహరించిన లక్ష్మీనారాయణనే ఎందుకు టార్గెట్ చేశారు.

రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ విషయంలో సీఐడీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారా? స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ ఉండగా, కేవలం డైరెక్టర్‌గా వ్యవహరించిన లక్ష్మీనారాయణనే ఎందుకు టార్గెట్ చేశారు. అప్పడు లక్ష్మీనారాయణతో కలిసి డైరెక్టర్లుగా చేసిన వారు ఇప్పటికీ అవే పదవుల్లో కొనసాగుతున్నారు, మరి వారిని ఎందుకని ప్రశ్నించలేదు. ఈ ప్రశ్నలు ఎన్నో అనుమానాలకు తావిస్తున్నాయి. టీడీపీ అయితే ఇదంతా జగన్ చేయిస్తున్న కుట్ర అంటూ విరుచుకుపడింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో డైరెక్టర్ హోదాలో ఉన్న లక్ష్మీనారాయణ.. గౌరవ వేతనం కూడా తీసుకోకుండా పనిచేశారు. పైగా ఈ కార్పొరేషన్‌కు ఛైర్మన్‌తో పాటు ఐదుగురు కార్యదర్శులు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. కాని, వారందరినీ వదిలేసి తనకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు లక్ష్మీనారాయణ. సీమెన్స్‌ ప్రాజెక్టు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి.

జగన్‌కు సన్నిహితుడనే ప్రేమచంద్రారెడ్డిని వదిలేశారని ఆరోపించారు. నిజానికి ప్రేమచంద్రారెడ్డి హయాంలోనే 371 కోట్ల చెల్లింపులు జరిగాయని, నిజంగా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తే ముందుగా ప్రేమచంద్రారెడ్డిని, తర్వాత అజయ్‌జైన్‌, రావత్‌లను ప్రశ్నించాలన్నారు. వారందరినీ వదిలేసి లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారుల్ని పంపిస్తారా అంటూ మండిపడ్డారు.

ఇంటికి సీఐడీ అధికారులు రావడంతో ఉద్వేగానికి గురైన లక్ష్మీనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు లోనై పడిపోయారు. తీవ్ర ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఫ్యామిలీ డాక్టర్‌ను పిలిపించారు. బీపీ ఎక్కువగా ఉందని, ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. సీఐడీ అధికారులు అందుకు అంగీకరించకపోవడంతో.. కుటుంబసభ్యులు అధికారులను నిలదీశారు. అనారోగ్యంతో పడిపోయినా ఆసుపత్రికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ఈ నెల 13న ఏపీ సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి వెళ్లిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story