PROTEST: బెంగళూరులో సమర శంఖారావం

PROTEST: బెంగళూరులో సమర శంఖారావం
చంద్రబాబుకు మద్దతుగా బహిరంగ సభ.. వైసీపీ పతనం మొదలైందన్న నేతలు..

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు మద్దతుగా బెంగళూరు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమర శంఖారావం పేరిట నిర్వహించిన ఈ సభకు ఐటీ ఉద్యోగులు, తెలుగుదేశం నేతలు హాజరయ్యారు. జగన్‌ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తోందని వారు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంగా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, దానికి ప్రతి ఒక్కరూ స్వరాష్ట్రానికి వచ్చి ఓటు వేయాలని తెలుగుదేశం నేతలు కోరారు. ఐటీ రంగానికి చంద్రబాబు చేసిన కృషి వల్లే ఇక్కడకు వచ్చామని తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అభిప్రాయపడింది. ఐటీ ఉద్యోగుల స్పందన రానున్నఎన్నికల్లో చూపిద్దామని ఆమె పిలుపునిచ్చారు.

జగన్‍ రాష్ట్రానికి సీఎం అయ్యాక ప్రజలకు చంద్రబాబు విలువ తెలిసొచ్చిందని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడ్డారు. బెంగళూరులోని మార్తనహళ్లిలో బాబు అరెస్టును ఖండిస్తూ మాతృభూమి కోసం సమరశంఖారావం పేరుతో ఐటీ ఉద్యోగులు నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న నేతలు...సీఎం జగన్ అవినీతి మరకను బాబుకు అంటించేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఐటీ నిపుణులు సొంత గ్రామాలకు వచ్చి రాష్ట్ర పరిస్థితులను ప్రజలకు వివరించాలని కోరారు.


గతంలో ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే వారని ఇప్పుడు అరాచక పాలన అంటున్నారని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌ అన్నారు. ఆరు నెలల తర్వాత ఏపీలో విజయ శంఖారావం సభ జరుపుతామని ఆయన జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ పాలనను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిపక్ష నేతలపై, అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో అనేక హామిలిచ్చిన జగన్‌.. తర్వాత వాటి అమలును మరిచిపోయారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మద్యపాన నిషేదం చేస్తామని ఆ మద్యం మీదనే అప్పు తెచ్చుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్టు చేసి భయపెట్టాలని చూస్తున్నారని.. కానీ సైనికుల్లాంటి కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం అని అయ్యన్న స్పష్టం చేశారు.

రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబుకు అన్యాయం జరిగిందన్న కసి ఐటీ ఉద్యోగులలో ఉందన్న నేతలు... వైసీపీ నేతలు మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో నెలకొన్న పరిస్ధితులను కళాకారులు కళ్లకు కట్టేలా ప్రదర్శించారు

Tags

Next Story