Minister Anam : దేవాలయాలపై విషప్రచారం చేయడం బాధాకరం

Minister Anam : దేవాలయాలపై విషప్రచారం చేయడం బాధాకరం
X

శుక్రవారం మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆలయాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను, వైసీపీ నేతల విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో హిందూ ధర్మం, ఆచారాలు, భగవంతుడిని రాజకీయ ఉచ్చులోకి లాగే ప్రతిపక్షం ఉండటం బాధాకరమని, ఇటువంటి రాజకీయాల గురించి మాట్లాడటం కూడా దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, గత ప్రభుత్వం యొక్క దుర్మార్గపు పాలన నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుతూ, దేవాలయాలను పవిత్రం చేయాలని నిర్ణయించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాలన ప్రారంభించిన చంద్రబాబు, అన్ని మతాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్ష హోదా లేని ఒక పార్టీ, నాయకత్వం లేని నేత, హిందూ మతంపై విశ్వాసం లేని వ్యక్తులు రాజకీయ కుటిల క్రీడలో భాగంగా హిందువుల మనోభావాలను గాయపరుస్తూ దేవాలయాలపై విషప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం హిందువులు ఆరాధించే దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ, ఆధ్యాత్మికతను పెంపొందించే కార్యక్రమాలను చేపట్టింది. గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే దేవాలయాల ప్రక్షాళనకు అనేక కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రజలు గుర్తించారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ కృషిని కొనియాడుతున్నారు. అయినప్పటికీ, వైసీపీ ద్వేషపూరిత ధోరణితో దేవాలయాలపై, పలకమండలిపై నిరంతరం విమర్శలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చింది. తిరుమలపై వైసీపీ నాయకులు చేస్తున్న విషప్రచారానికి దేవుడు క్షమించడని, జరగని విషయాలను జరిగినట్లు అనుకూల మీడియాలో ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని వైసీపీ భ్రమలో ఉందని ఆయన అన్నారు. దేవుడిపై ఇటువంటి తప్పుడు విధానాలు సరికాదని, 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంత దిగజారుడు ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని అపవిత్రం చేసేలా, ఆధ్యాత్మిక సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేస్తూ జగన్మోహన్ రెడ్డి సైకో ఆనందం పొందుతున్నాడని ఆరోపించారు. జగన్‌ను తట్టుకోలేక ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్న ఏకైక నాయకుడు జగన్ అని అన్నారు. వైసీపీ తరపున గెలిచిన 11 మంది శాసనసభ్యుల్లో సగం మంది సెంట్రల్ జైళ్లలో ఉన్నారని, ఇది వైసీపీ గత పాపాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రతిపక్షం లేని శాసనసభను ఎన్నడూ చూడలేదని, వైసీపీ నడిపిన లిక్కర్ స్కాం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని, భూదోపిడీ విషయాలు కూడా బయటకు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. పులివెందులలో జగన్‌ను ప్రజలు తిరస్కరించారని, తమకు ఎందుకు ఇటువంటి తీర్పు వచ్చిందో ఆలోచించకుండా ప్రజలపైనే నిందలు వేస్తున్నాడని జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైసీపీ దుర్మార్గాలు, అవినీతి, దోపిడీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి జగన్ “డైవర్షన్ పాలిటిక్స్” ఎంచుకున్నాడని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 95% హామీలను నెరవేర్చింది. హిందూ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేసామని, అర్చకుల వేతనం ₹10,000 నుంచి ₹15,000కి పెంచామని, ₹66 కోట్లతో 5,211 మంది అర్చకులకు ధూప, దీప, నైవేద్యాల కోసం ₹5,000 నుంచి ₹10,000కు పెంచామని, వేద విద్య చదివిన 599 మంది నిరుద్యోగులకు ₹3,000 భృతి ఇస్తున్నామని ఆయన తెలిపారు. దేవాలయ ఆగమ సంప్రదాయాల్లో అధికారుల జోక్యం లేకుండా ఉత్తర్వులు జారీ చేశామని, బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ట్రస్టు బోర్డులలో సభ్యత్వం కల్పించే చట్టం తీసుకొచ్చామని, నాయీ బ్రాహ్మణులకు కనీసం ₹25,000 వేతనం ఉండేలా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. గత ప్రభుత్వం దేవదాయ శాఖలో ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని, కానీ కూటమి ప్రభుత్వం 500కు పైగా ఖాళీలను భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తోందని తెలిపారు. వెనుకబడిన జిల్లాల్లో శిథిలమైన దేవాలయాలను ₹777 కోట్లతో 377 ఆలయాలను పునర్నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, 206 ఆలయాల పునర్నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని, మిగిలిన వాటికి టెండర్లు పిలిచామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఆలయాన్ని కూడా పట్టించుకోలేదని, కానీ కూటమి ప్రభుత్వం భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ, తిరుమలను ఆదర్శ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టడానికి, టిటిడి పవిత్రతను కాపాడడానికి నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, వైసీపీ గతంలో చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వంపై రుద్దాలని చూస్తోందని ఆయన విమర్శించారు. కరుణాకర్ రెడ్డి నాస్తికుడని అందరికీ తెలుసని, టిటిడిని రాజకీయ అడ్డాగా మార్చి దోపిడీ చేసినవాడు ఇప్పుడు పవిత్రత గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు చదివినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. లడ్డు కల్తీ ఎక్కడి నుంచి మొదలైందో ప్రజలకు తెలుసని, స్వామివారి సొమ్మును సత్రాలు కట్టే నెపంతో దోచుకున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు దీర్ఘదృష్టితో దేవదాయ శాఖను గాడిలో పెడుతున్నారని, వైసీపీ దేవుడిని సైతం వదలకుండా దోచుకున్నారని అందుకే 11 సీట్లు వచ్చాయని అయినా బుద్ధి రాలేదని, హిందూ దేవాలయాలపై విషప్రచారంతో ప్రజలను బాధపెడుతోందని ఆయన అన్నారు. వైసీపీ కుట్రలను ప్రజలు తెలుసుకోవాలని, కరుణాకర్ రెడ్డి వంటి నాస్తికులకు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. సుపరిపాలన అందిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోంది. దేవుడి ఆశీస్సులు, ప్రజల మద్దతుతో ఈ దుర్మార్గాలను ఎదుర్కొంటామని తెలిపారు.

Tags

Next Story