PAWAN: వైసీపీని అధఃపాతాళానికి తొక్కేయాలి: పవన్

PAWAN: వైసీపీని అధఃపాతాళానికి తొక్కేయాలి: పవన్
జగన్‌కు భూమిని తొలిచి డబ్బు తీయడమే తెలుసు... జగన్‌ను నమ్మి అందలమెక్కిస్తే నిలువునా ముంచేశారన్న పవన్‌

ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టేసిన వైసీపీని అధఃపాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. లేకుంటే మన భవితకు మరింత నష్టం కలుగుతుందని ప్రజలను హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన మ్యానిఫెస్టోతో అందరికీ మేలు జరుగుతుందన్న పవన్‌... అమలు బాధ్యతను తాను తీసుకుంటానని విశాఖలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో హామీ ఇచ్చారు. జగన్‌కు భూమిని తొలిచి డబ్బు తీయడమే తెలుసని.....భూమిలో విత్తనం నాటి పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదని పవన్‌ విమర్శించారు. కనీసం నీడనిచ్చే వేప చెట్టునైనా పెంచే మానసిక స్థితి జగన్‌కు లేదని విశాఖలో నిర్వహించిన ఎన్నికల సభలో దుయ్యబట్టారు. నమ్మి అందలమెక్కిస్తే నిలువునా ముంచేశారని విమర్శించారు. ఇప్పుడు ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని పవన్‌ హెచ్చరించారు.


ఓట్ల బలంతో జగన్‌ను తుంగలో తొక్కేయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్న పవన్ …..ఓ పాట రూపంలో వైసీపీ పాలనను ఎద్దేవా చేశారు. ఆర్థిక రాజధానితో పాటు విశాఖను స్పోర్ట్‌ క్యాపిటల్‌గా మారుస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్‌కు ఆయన అభిమానులు చేపలు అందించారు.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. ఎన్నికలకు ఇక పదిరోజులే సమయం ఉండటంతో అధికార, విపక్ష పార్టీల అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ, సినీ నటులు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్లి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి

పెనమలూరు నియోజకవర్గం కానూరులో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు, కోడలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుడ్లవల్లేరు మండలంలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము రోడ్‌ షో నిర్వహించారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ సతీమణి శిరీష ప్రచారం చేశారు. పెనుగంచిప్రోలు మండలం కొనకంచిలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య రోడ్‌ షో నిర్వహించి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. కంచికర్ల మండలంలో తంగిరాల సౌమ్య ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. విజయవాడలో గద్దె రామ్మోహన్‌, రణదీర్ నగర్ కరకట్టలో ఆయన భార్య అనురాధ ఇంటింటికీ వెళ్లి.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Tags

Next Story