ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఆస్తుల కేసుపై మంగళవారం నుంచి రోజువారీ విచారణ జరగనుంది. హైదరాబాద్ నాంపల్లిలోని గగన్‌విహార్‌లో ఉన్న CBI కోర్టులో వాదనలు మొదలవుతాయి. సీబీఐ దాఖలు చేసిన 11 ఛార్జ్‌షీట్లు, ED దాఖలు చేసిన 5 ఛార్జ్‌షీట్లపైన CBI ప్రధానన్యాయమూర్తి విచారణ చేపట్టనున్నారు. ముందుగా 5 CBI ఛార్జ్‌షీట్లపై మంగళవారం వాదనలు జరుగుతాయి. జగతి పెట్టుబడులు, వాన్‌పిక్, రాంకీ, పెన్నా సిమెంట్స్, రఘురాం సిమెంట్స్ కేసుల్ని విచారిస్తారు. అటు, మనీలాండరింగ్‌పై నమోదైన ఐదింటిపై ఈడీ ప్రత్యేక కోర్టు విచారిస్తుంది. ఓబుళాపురం మైనింగ్ కేసులోనూ వాదనలు ప్రారంభంకానున్నాయి. నిజానికి 2 వారాల క్రితమే రోజువారీ విచారణ మొదలు కావాల్సి ఉన్నా అప్పుడు కొద్ది రోజులు న్యాయమూర్తి సెలవులో ఉండడం, తర్వాత హైదరాబాద్‌ను వర్షాలు ముంచెత్తడం, తర్వాత దసరా ఉత్సవాల కారణంగా కేసు వాయిదా పడింది. మంగళవారం నుంచి రెగ్యులర్ విచారణ చేపట్టడం ద్వారా త్వరగా వీటిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులు త్వరగా తేల్చాలన్న సుప్రీం ఆదేశాలతోనే ఇప్పుడు జగన్ కేసుల విచారణలో స్పీడ్ పెరిగింది. ప్రస్తుతం కోవిడ్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్‌తోపాటు, భౌతికంగా కోర్టులోనూ ఆస్తుల కేసు విచారణ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com