YS Sharmila: వైఎస్సార్ అభిమానులకు షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ

ఏపీ మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వైఎస్సార్ అభిమానులకు 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. వైఎస్ అభిమానులకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
‘‘ఈరోజు పొద్దున సాక్షి పేపర్ చూశాను. సాక్షి మీడియా జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఉంది. కాబట్టి ఏదైనా నమ్మించగలరు. అయినా వైఎస్సార్ అభిమానులకు అసలు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం నాది. అమ్మ వైఎస్ విజయమ్మ, నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. 'రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తయితే.. తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం. నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో, తక్కువ చేసో చూడలేదు. నాన్న బతికి ఉన్నన్ని రోజులూ ఒకే మాట అనేవారు. 'నా' నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం.
వైఎస్సార్ బతికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కూ సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ మోహన్ రెడ్డి సొంతం కాదు. ఉన్న అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ 'గార్డియన్' మాత్రమే. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాల్సిన బాధ్యత ఆయనదే. ఇది రాజశేఖర్ రెడ్డి మ్యాండేట్. వైఎస్సార్ ఈ ఉద్దేశం ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి సహా సన్నిహితులందరికీ స్పష్టంగా తెలుసు. నాన్న బతికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో సరస్వతి, భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా.. నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కు సమాన వాటా ఉండాలన్నది వైఎస్ఆర్ మ్యాండేట్.
2019లో జగన్ సీఎం అయిన వెంటనే గుర్తు పట్టలేనంతగా మారిపోయారని లేఖలో ఆరోపించారు. సీఎం అయిన నెలరోజులకే విడిపోదాం అంటూ ఇజ్రాయిల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారని అన్నారు. అమ్మ విజయలక్ష్మి మీద ఎన్‌సీఎల్‌టీలో కేసు పెట్టిన విషయం బయటకు వస్తే కుటుం ప్రతిష్ట బజారున పడుతుందన భయంతో తాము మాట్లాడలేదని అన్నారు. ఒక కుమారుడు తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితిని తీసుకువచ్చారని విమర్శించారు. కుటుంబ బంధం, స్నేహ బంధంతో మనుషులు ఒక్కటవుతారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్ బంధం ఏర్పరుచుకున్న ప్రతి వైఎస్సార్ బంధువుకి వివరణ ఇస్తున్నానని వెల్లడించారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com