JAGAN: జగన్ పర్యటనకు షరతులు వర్తిస్తాయ్

చిత్తూరు జిల్లా బంగారుపాళెంలో పర్యటించనున్న వైఎస్ జగన్‌కు పోలీసులు అనుమతులు ఇస్తూనే, మరోవైపు షరతులు విధించారు. మామిడి రైతులతో మాట్లాడి, వాళ్ల ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 9న జగన్ బంగారుపాళేనికి వెళ్లనున్నారు. జగన్ పర్యటనకు అనుమతులపై పోలీసులు మొదట నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నాయకుడు జగన్ చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చి తీరుతారని వైసీపీ నాయకులు పోలీస్ అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో మొదట జగన్ హెలిప్యాడ్‌కు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. హెలిప్యాడ్ వద్ద జగన్‌కు స్వాగతం పలికేందుకు 30 మందికి అనుమతి ఇచ్చారు. అలాగే జగన్ పర్యటనలో 500 మంది మాత్రమే పాల్గొనాలని చిత్తూరు పోలీస్ అధికారులు తేల్చి చెప్పారు. జగన్ పర్యటనలో భాగంగా ర్యాలీలు, ఊరేగింపులు చేయకూడదని పోలీసులు వైసీపీ నాయకులకు తెలిపారు.
పల్నాడు పర్యటనలోనూ..
పల్నాడు జిల్లా పర్యటనలో కూడా ఇలాంటి షరతులే విధించిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా పర్యటనలో 100 మంది మాత్రమే పాల్గొనాలని పోలీసులు చెప్పడంతో, ఆయన పర్యటనకు విపరీతమైన మైలేజ్ వచ్చింది. ఇప్పుడు చిత్తూరు జిల్లా పర్యటనను పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. జగన్ రాకకోసం చిత్తూరు, అలాగే సమీపంలోని అన్నమయ్య, కడప జిల్లాల వైసీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. గతంలో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అపశృతులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బంగారుపాళ్యంలో జగన్ పర్యటిస్తున్న ప్రాంతంలో పెట్రోల్ బంకులు, పాఠశాలలు ఉన్నందున సమయపాలన పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. జగన్ కు అవసరమైతే రోప్ పార్టీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
రాష్ట్రపతి పాలన విధించండి-జగన్
కూటమి ప్రభుత్వంపై మరోసారి ఏపీ మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాల తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోందన్నారు. వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నారని ఆరోపించారు. అదీ వీలుకాకపోతే, తమవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపేప్రయత్నంచేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వైరల్ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోందని రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com