JAGAN: పరామర్శల మాటున.. బల ప్రదర్శన

అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ పరదాలు కట్టుకుని... మందీమార్బలంతో సామాన్యుడిని అసలు దగ్గరికే రానివ్వకుండా చేసిన జగన్.. పదవి నుంచి దిగిపోయిన తర్వాత కొత్త నాటకానికి తెర తీశారు. శాసన ఎన్నికల్లో కూటమి కొట్టిన దెబ్బకు పాతాళానికి పడిపోయిన వైసీపీ.. ఇప్పుడు ఉనికి చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసేస్తున్నారు. జనం తనతోనే ఉన్నారని చాటింపు వేసుకునేందుకు.. అవకాశాలను సృష్టించుకుని మరీ ఆపదలు కొనితెస్తున్నారు. పరామర్శల పేరిట ప్రజలపై దండయాత్ర చేస్తున్నారు. ప్రజల ప్రాణలతో చెలగాటం అడుతూ.. బల ప్రదర్శనకు దిగుతున్నారు. బాధిత కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పాల్సిన జగన్... తన పరామర్శ యాత్రలో ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టించి.. సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. జగన్నాటకానికి వైసీపీ నేతలు, శ్రేణులు కావాల్సినంత సాయం చేస్తున్నాయి. జగన్ కనిపించగానే ఆయన వైపు దూసుకెళ్లి కావాల్సినంత సీన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇవన్నీ చేసి మళ్లీ జగన్ పర్యటనకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం ఇవ్వడం లేదంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నాయి. ‘భద్రతా వైఫల్యం’ అంటూ ప్రభుత్వంపై నిందలు వేసేందుకు వైసీపీ నేతలు పథకం ప్రకారం నడుచుకుంటున్నారు. జగన్ వచ్చింది... పరామర్శలకో.. బల ప్రదర్శనలకో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. పోలీసులు ఆంక్షలు విధించినా.. ప్రమాదం అని హెచ్చరించినా వాటిని పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తారు.
పోలీసులపైనే దాడులు చేసేంత ధైర్యం
వైఎస్ జగన్ ‘పరామర్శ యాత్ర’ ఒక అరాచక పర్వాన్ని తలపిస్తోంది. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ లేని కార్యకర్తల దూకుడుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో తన కారు కింద సొంత పార్టీ కార్యకర్త సింగయ్య పడినా దయ లేకుండా ముందుకెళ్లి జగన్ తన నాటకాన్ని ప్రదర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోనూ రైతులను పరామర్శించేందుకంటూ అదే నటనను మరింత రక్తి కట్టించారు. సామాన్యంగా జనంలోకి రాని జగన్ ఎప్పుడు ప్రజల్లోకి వచ్చినా ఇలాంటి దుర్ఘటనలే పునారవృతమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడులో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్లినప్పుడు కూడా పోలీసులపై , అక్కడ గందరగోళం నెలకొంది. పోలీసులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి దిగారు. పొగాకు రైతులతో పరామర్శ పేరిట జగన్ ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్లినప్పుడు, వేలాది మంది గుమిగూడారు. సాక్షి ఛానల్ చర్చలో అమరావతి మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. జగన్ గుంటూరు మిర్చియార్డును సందర్శంచినప్పుడు కూడా వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులతో ఇష్టానుసారంగా ప్రవర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com