YS Jagan : జగన్ పాలనలో ఎవరికి మంచి జరిగింది..?

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేయాలని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని, ఈ లోపే ప్రజల్లోకి వెళ్లి మళ్లీ అధికారంలోకి వస్తానని జగన్ చెప్పడం నిజంగా హాస్యాస్పదమే అనుకోవాలి. ఇప్పటికే “జగన్ ఉంటే తమకు ఎంతో మేలు జరిగేదని ప్రజలు అనుకుంటున్నారు” అంటూ వైసీపీ అధినేత చెప్పడం చూస్తే ప్రజలు నిజంగానే నవ్వుకుంటున్నారు. జగన్ ప్రభుత్వం నిజంగా అభివృద్ధి చేసి ఉంటే, 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయేవారే కాదు కదా. ప్రజలు ఎప్పుడూ అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్నే తిరిగి గెలిపిస్తారు. కానీ జగన్ ప్రభుత్వానికి వచ్చిన ఓటమి మాత్రం సాధారణ ఓటమి కాదు… అది ప్రజల అసంతృప్తికి నిదర్శనం. అభివృద్ధి లేకపోవడం, అరాచక పాలన, ప్రశ్నించిన వారిపై కేసులు, భయభ్రాంతుల వాతావరణం… ఇవన్నీ కలిసే జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నది వాస్తవం.
ఒకప్పుడు పాదయాత్ర అనేది రాజకీయంగా పనిచేసింది. ప్రజల్లో సానుభూతి, కొత్త నాయకుడిపై ఆశలు ఉండేవి. కానీ ప్రతిసారి పాదయాత్ర చేస్తే గెలుస్తామనుకోవడం రాజకీయ అవివేకమే అవుతుంది. ఏపీకి నిజంగా మంచి చేసి ఉంటే జగన్ కు మళ్లీ పాదయాత్ర చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. ప్రజలే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చేవారు. జగన్ ఉంటే ఎవరి జీవితాల్లో మార్పు వచ్చింది.. ఈరోజు ఏపీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇదే. ఉద్యోగాలు వచ్చాయా? రైతులకు న్యాయం జరిగిందా? యువతకు భవిష్యత్ కనిపించిందా? అని అడుగుతున్నారు ప్రజలు.
అమరావతి రైతులను వేధించడం, శాంతియుతంగా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టించడం, మహిళలను అవమానించే ఘటనలు… ఇవన్నీ జగన్ పాలనలో భాగం. అమరావతి కోసం పోరాడిన రైతులను అణచివేసిన నాయకుడికి మళ్లీ ఓటు వేయాలా? అని ప్రజలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి అన్న మాట లేకుండా, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, పరిశ్రమలను దూరం చేసి, రాజధాని లేకుండా చేసిన పాలన తర్వాత మళ్లీ పాదయాత్రలు చేయడం అంటే… ప్రజల్ని సెంటిమెంట్ తో మోసం చేయడానికి జగన్ రెడీ అవుతున్నాడని అంతా అనుకోవాలేమో.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
