మామిడి రైతుల్ని పట్టించుకోని జగన్‌ సర్కార్‌

మామిడి రైతుల్ని పట్టించుకోని జగన్‌ సర్కార్‌
ప్రకృతి విపత్తులను కూడా తట్టుకోని నిలబడ్డ మామిడి రైతు సర్కారు కొట్టిన దెబ్బలకు విలవిల్లాడి పోతున్నాడు.

తీపి పంచే మామిడి రైతుకు చేదు మిగులుతోంది.మామిడి రైతును జగన్‌ సర్కార్‌ పట్టించుకోవడం లేదని చిత్తూరు జిల్లా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతు సంక్షేమ సర్కార్‌ అని చెప్పుకొనే ప్రభుత్వం చేతల్లో మాత్రం వారిక చుక్కలు చూపిస్తోంది.దీనికి ఉదాహరణే పాలకుల దెబ్బకు కుదేలైపోయిన చిత్తూరు మామిడి రైతు.ప్రకృతి విపత్తులను కూడా తట్టుకోని నిలబడ్డ మామిడి రైతు సర్కారు కొట్టిన దెబ్బలకు విలవిల్లాడి పోతున్నాడు.పంట బీమా తీసేశారు నాణ్యత పెంచే కవర్లపై రాయితీని కూడా ఎత్తేశారు.గిట్టుబాటు ధర అందని ద్రాక్షగానే మారిపోయింది.చీడను నివారించే వ్యవస్థ అసలే లేదు.ఇక మార్కెటింగ్‌ చేసే సౌకర్యం కూడా కరువైంది.మామిడి సాగు,ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నా ఏపీలో రైతు పరిస్థితి దయనీయంగా మారింది.

చిత్తూరు జిల్లా మామిడి రైతును ఓ పక్క మంగు మరోపక్క అకాల వానల బీభత్సం దారుణంగా దెబ్బతీశాయి.అయినా తట్టుకుని చెప్పుకోదగ్గ స్థాయిలో దిగుబడులు సాధించాడు. అయితే సకాలంలో అండగా నిలబడాల్సిన సర్కారు మాత్రం చేతులెత్తేసి రైతును గాలికి వదిలేసింది. మూడేళ్ల కిందటి వరకు మామిడికి ఉన్న బీమాను ఎత్తేసి, వారిని చావుదెబ్బ కొట్టిన సర్కారు.. మామిడి నాణ్యతను పెంచేం ఫ్రూట్‌ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులు ఎగ్గొట్టి వారిని మరింతగా కష్టాల్లోకి నెట్టేసింది.

ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.తోతాపురి సాగు ఎక్కువ. దీనిమీద ఆధారపడి 39 వరకు గుజ్జు పరిశ్రమలున్నాయి. అయితే జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి కుటుంబానికి మామిడి గుజ్జు పరిశ్రమ ఉంది. ఈయన అండతోనే వ్యాపారులు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోతాపురి రకానికి టన్నుకు 10 వేల నుంచి 12 వేల మధ్యనే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి టన్నుకు 19 వేలు ఇవ్వాలని కలెక్టర్‌ నిర్ణయించారు. ఆ తర్వాత తగ్గించి 15 వేలుగా ప్రకటించారు. అయినా ఆ ధరకు కూడా వ్యాపారులు కొనడం లేదు. గుజ్జు పరిశ్రమకు తీసుకెళ్తే టన్నుకు 11 వేలు మాత్రమే ఇస్తున్నారని మండిపడుతున్నారు.

మరోవైపు మామిడి పంటను 2019లో బీమా నుంచి తప్పించారు. గత రెండేళ్లలో వేలాదిమంది రైతులు భారీగా నష్టపోయారు. ఏటా సగటున ఎకరాకు 30 వేల నుంచి 50 వేల వరకు కోల్పోయారు. అయినా ప్రభుత్వం కనికరించలేదు. ఇక మామిడి రైతులకు 50 శాతం నుంచి, 70 శాతం రాయితీపై కవర్లను సరఫరా చేసేది. వీటిని కాయలకు తొడిగి చీడపీడల నుంచి రక్షించుకునే అవకాశం ఉండేది.. అయితే ఖజానా ఖాళీ అయిపోయిందనో మరే కారణమో కవర్లను సర్కారు ఇవ్వలేకపోయింది. రాష్ట్ర ప్రణాళిక కింద కవర్లకు ఇచ్చే రాయితీ నిలిపేసింది. రాష్ట్రంలో మామిడి ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఉన్నా ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లేదు. కొత్తగా ప్యాకింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నా ప్రభుత్వం నుంచి సహకారం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో జిల్లాలో రైతులు మామిడిని సాగు చేయాలంటేపే భయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story