Jai Bhim Bharat Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. జై భీం భారత్ పార్టీ పేరుతో..

Jai Bhim Bharat Party: ఏపీలో కొత్త రాజకీయ పార్టీ.. జై భీం భారత్ పార్టీ పేరుతో..
X
Jai Bhim Bharat Party: హైకోర్టు లాయర్‌ జడ శ్రవణ్ కుమార్ జై భీం భారత్ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.

Jai Bhim Bharat Party: ఏపీలో మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకుంది. హైకోర్టు లాయర్‌, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్ కుమార్ జై భీం భారత్ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. బెజవాడ వేదిక పార్టీని ప్రకటించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి జింఖానా గ్రౌండ్‌ వరకు కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

రాష్ట్రంలో దళిత బిడ్డల కోసమే జై భీం భారత్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామన్నారు లాయర్‌ శ్రవణ్‌ కుమార్‌. ఇతర పార్టీలు దళితుల పక్షపాతి అని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. దళిత హోంమంత్రి ఉన్నా న్యాయం జరగడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అట్టడుగు వర్గాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర పథకాలకు మళ్లించి.. బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్నారన్నారు. సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో సబ్‌ప్లాన్‌పై ఎక్కడైనా చర్చిస్తానని సవాల్‌ విసిరారు. 26 రకాల దళిత స్కీమ్‌లను జగన్‌ రద్దు చేశారని విమర్శించారు. మన ఓటు మన పాలన అనే నినాదంతో ముందుకు వెళుతామని స్పష్టం చేశారు.

కొత్త పార్టీ ఏర్పాటుపై గతంలోనే శ్రవణ్ కుమార్ ప్రకటించారు. 2024 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ దళిత బహుజనులను పోటీ చేయిస్తామని చెప్పారు. అలాగే దళితుల సమస్యలపై చర్చించేందుకు ప్రతి నెలా దళిత అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో మరో నూతన పార్టీ ఆవిర్భావం ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story