PAWAN: పేదల పొట్ట కొడుతున్న జగన్
జగన్ పాలనలో పేదలు, సామాన్య ప్రజల పొట్టకొట్టారని పవన్ ఆరోపించారు. ఉపాధిహామీ అక్రమాలు, కేంద్ర నిధులు దారి మళ్లించి దోచుకున్నారని మండిపడ్డారు. పెడన ప్రజాగళం సభలో పాల్గొన్న ఆయన చేనేత, కళంకారీ ప్రజలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ఆదుకునేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. తీరప్రాంతాల్లో జెట్టీలు నిర్మించి ఉపాధి కల్పిస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీదారులను శిక్షిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను రామరాజ్యం వైపు నడిపిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టేందుకు అందరూ కలసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల నుంచి ఎంతో కష్టపడి పనిచేశామని చెప్పారు. శ్రీరామ నవమి వేళ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో శాసనసభ, ఎంపీ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీఫారాలు అందజేశారు. తొలి బీఫారంను తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు ఇచ్చారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని పవన్ అన్నారు. అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్‌నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ ప్రజలే దేవుళ్లు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం. పోలవరం పూర్తి చేసి, నదుల అనుసంధానానికి కృషి చేస్తాం. విద్య, ఉపాధి అవకాశాలు, అభివృద్ధికి కంకణబద్ధులై పనిచేస్తాం. వలసలు లేని, పస్తులు లేని వికసిత ఏపీ ఏర్పాటు మనందరి బాధ్యత. జనసేన, తెదేపా, భాజపా కూటమి గెలుపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. అవినీతి, రాక్షస పాలనను తరిమికొట్టాలి. అందరూ కలిసి పనిచేయాలి.. ప్రజల్లోకి వెళ్లాలి. వివాదాలకు తావులేకుండా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి’’ అని పార్టీ అభ్యర్థులకు జనసేనాని దిశానిర్దేశం చేశారు.
జగన్‌కు గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైసీపీ నాయకులు హడావుడి చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమర్‌నాథ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైసీపీ కార్యకర్త నిర్దాక్షిణ్యంగా పెట్రోలు పోసి తగలబెడితే అప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే దాడుల ఘటలు జరుగుతాయా అని తెనాలి సభలో ధ్వజమెత్తారు. ఎన్నికలు రాగానే వైఎస్ జగన్‌కు ఏదోలా గాయమవుతుందని ఎవరో ఒకరు చనిపోతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. మాజీమంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో నరికి చంపేస్తే గుండెపోటు అని చెప్పారన్నారు. షర్మిల, సునీత, వైఎస్ న్యాయం చేయమని కోరితే వారిని జగన్ కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే కూటమిగా వచ్చినట్లు వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి సీపీఎస్‌పై అసెంబ్లీలో చర్చ పెడతామని పవన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికుల నిధి డబ్బులు 450 కోట్లను జగన్ దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక దొరకకుండా చేసి 21 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు 34 నుంచి 24 శాతానికి తగ్గించి వారిని అధికారానికి దూరం చేశారని విమర్శించారు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి 4,163 కోట్లు మళ్లించారని ధ్వజమెత్తారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com