AP: వైసీపీపై ఈసీకి జనసేన-టీడీపీ ఫిర్యాదు

AP: వైసీపీపై ఈసీకి జనసేన-టీడీపీ ఫిర్యాదు
జగన్ పై రాయిదాడి ఘటనలో లోతైన విచారణ జరిపించాలన్న జనసేన... వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని టీడీపీ ఫిర్యాదు

ముఖ్యమంత్రి జగన్ పై రాయిదాడి ఘటనలో లోతైన విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారికి వినతి పత్రం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్న విజయవాడ సీపీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలపైనే ఆరోపణలు తలెత్తుతున్నాయని.. దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందన్న విశ్వాసం లేదని జనసేన ఆ ఫిర్యాదులో పేర్కోంది. రాయి దాడి ఘటన చాలా అనుమానాలకు తావిస్తోందని ఈ వ్యవహారాన్ని లోతుగా విచారణ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ జనసేన పార్టీ నేతలు సీఈఓకి ఫిర్యాదు చేశారు. రాయిదాడి ఘటన ముఖ్యమంత్రి భద్రతనే సవాలు చేసేలా ఉందని జన సేన పేర్కోంది. మరోవైపు ఇటీవల ప్రధాని పాల్గోన్న సభలోనూ భద్రతా వైఫల్యం తలెత్తిందని ఈ ఘటనలోనూ సరైన విచారణ జరగలేదని జనసేన తన ఫిర్యాదులో పేర్కోంది.


ఎన్నికల షెడ్యూలు ప్రకటన నుంచి ఏపీలో అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ ఫిర్యాదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్పడ్డారని పేర్కోంటూ వినతిపత్రం ఇచ్చింది. ఈ హింసాత్మక ఘటనలు జరిగినా సదరు పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించి కేసులు కూడా నమోదు చేయలేదని టీడీపీ నేతలు వర్లరామయ్య, జవహర్ తదితరులు ఆరోపించారు. వీరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని విధుల నుంచి తప్పించాలని కోరుతూ సీఈఓకి వినతిపత్రం ఇచ్చినట్టు వెల్లడించారు.

మరోవైపు ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టోద్దని ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని ఆయన ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. ఈమేరకు పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలకు సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది స్వయంసహాయక బృందాలను ప్రభావితం చేసేలా ఏ కార్యకలాపాలు చేపట్టోద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా, బృందంగా కానీ డ్వాక్రా సంఘాలను రాజకీయంగా ప్రభావితం చేసే నిర్ణయాలు వద్దని ఎన్నికల సీఈఓ తేల్చి చెప్పారు. అవగాహన పేరుతో సమావేశాల నిర్వహణ, సర్వే తదితర కార్యక్రమాలు నిర్వహించకూదదని సెర్ప్ సీఈఓకు , మెప్మా మిషన్ డైరెక్టర్ లకు ఆదేశాలిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story