N.V.RAMANA: అమరావతి పోరాటం.. అతిపెద్ద రైతు ఉద్యమం

దేశంలో వ్యవసాయం అంటరానిదిగా మారిందని రైతులు అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ N.V రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో రైతు సంఘాల మధ్య చైతన్యం, ఐక్యత తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని ప్రాంత రైతుల పోరాటం దక్షిణాదిలో జరిగిన అతి పెద్ద రైతు ఉద్యమంగా అభివర్ణించారు. చట్టసభలతో పాటు కీలక వ్యవస్థల్లో రైతులకు తగిన ప్రాతినిధ్యం లభించేందుకు రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఒక రోజు పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లాకు విచ్చేశారు. వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్ 32వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కామథేను మిల్క్ ప్రాజెక్టు పేరిట నిర్మించిన నూతన ప్లాంట్‌ను సందర్శించారు. 1200 కోట్ల రూపాయల వార్షిక టర్నోవర్‌కు మిల్క్ యూనియన్ చేరడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కృష్ణా మిల్క్ యూనియన్ క్షణక్షణాభివృద్ధి చెందుతోందని పాలకవర్గాన్ని అభినందించారు. పాడి రైతులకు మూడో విడత బోనస్ చెక్కులను అందజేశారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు, రైతులు జస్టిస్ ఎన్.వి. రమణను సముచితంగా సత్కరించారు. సొంత జిల్లాలో సొంత మనుషుల మధ్య సత్కారం ప్రత్యేకమైందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సమాజం నాగరికంగా అభివృద్ధి చెందిన క్రమంలో రైతులకు తగిన గుర్తింపు లేదని.. వ్యవసాయం అంటరానిదిగా మారిపోతోందని ఆవేదన చెందారు. కోట్ల సంఖ్యలో రైతులున్నప్పటికీ వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం లేదని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. వ్యవసాయం పరిశ్రమగా గుర్తింపు పొందలేకపోవడమే ఇందుకు ఓ కారణంగా కనిపిస్తోందన్నారు.
అమరావతి రైతుల పోరాటాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో జరిగిన అతిపెద్ద రైతు పోరాటంగా జస్టిస్ రమణ అభివర్ణించారు. అమరావతి రైతులు ఎలాంటి నేరం చేయకపోయినా....రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి వేధించడం బాధాకరమన్నారు. తొలుత జస్టిస్ ఎన్.వి రమణ బాపులపాడు మండలం బొమ్ములూరులో పర్యటించారు. గ్రామానికి చెందిన తన మిత్రుడు ముసునూరు కాశీ నివాసంలో వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశమయ్యారు. అక్కడి రామాలయం, దాసాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com