Kadapa Floods: వరద ధాటికి కూలిపోతున్న వంతెనలు, భవనాలు.. ప్రమాదంలో వేలమంది ప్రాణాలు..

Kadapa Floods (tv5news.in)

Kadapa Floods (tv5news.in)

Kadapa Floods: వరద విలయంతో కడప జిల్లా అతలాకుతలమైంది. కమలాపురం, వల్లూరు మధ్య వంతెన కూలిపోయింది.

Kadapa Floods: వరద విలయంతో కడప జిల్లా అతలాకుతలమైంది. కమలాపురం, వల్లూరు మధ్య వంతెన కూలిపోయింది. పాపాగ్ని నదికి వరద పోటెత్తడంతో వెలిగల్లు ప్రాజెక్టు నుంచి నాలుగు గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు వదిలారు. దీంతో ఆ వరదంతా వంతెన అంచును తాకుతూ ప్రవహిస్తోంది.. వరద ఉధృతికి వంతెన నానిపోయి.. కుంగిపోయింది.. ఆరు పిల్లర్ల వరకు కూలిపోయింది.

బ్రిడ్జి కుంగిపోవడంతో కడప-కమలాపురం మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. దీంతో ఏటూరు-ఖాజీపేట మీదుగా కమలాపురం నుంచి కడపకు వాహనాలను మళ్లిస్తున్నారు అధికారులు. పాపాగ్ని నది ఉధృతితో కమలాపురం పట్టణాన్ని వరద ముంచెత్తింది. కడప పట్టణంలోనూ వర్ష బీభత్సం సృష్టించింది. చాలా కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లను దారి మళ్లించారు అధికారులు.

చెన్నై-తిరుపతి మధ్య కడప మీదుగా నడిచే రైళ్లు రద్దయ్యాయి. రేణిగుంట-గుంతకల్లు మధ్య నడిచే ప్యాసింజర్ రైలు రద్దు చేశారు. ఇక అన్నమయ్య రిజర్వాయర్ కట్ట తెగిపోవడంతో దిగువ ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. రాజంపేట, నందలూరు ప్రాంతంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. రాజంపేట మండలంలో పులపుత్తూరు, గుండ్లూరు, చొప్పావారిపల్లె, తోగూరు, ఎగువ, దిగువ మందపల్లి, రామాపురాన్ని చెయ్యేరు వరద ముంచెత్తింది.

కాలనీల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇళ్లన్ని కూలిపోయాయి. కట్టుబట్టతో మిగిలిపోయారు జనం. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు జనం. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగింది. జిల్లాలో 15 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గల్లంతయ్యారు. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన వరి పంట వరద పాలైంది. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మూగజీవాలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయాయి.

ఎగువ నుంచి పెన్నానదికి భారీగా వరద వస్తుండడంతో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాలను అధికారులు అప్రమత్తం చేశారు. పెన్నాలో ప్రస్తుతం లక్షా 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తోంది. జమ్మలమడుగు, కొండాపురం, మైలవరం, ఎర్రగుంట్ల, రాజుపాలెం మండలాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అప్రమత్తం చేయలేదని మండిపడుతున్నారు.

సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కడప జిల్లాలో వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి.. సహాయక చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రాణ నష్టం, ఆస్తినష్టం, ఎన్ని మూగజీవాలు చనిపోయాయన్న వివరాలు సైతం అధికారికంగా వెల్లడించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు.

ప్రాజెక్టులకు కొట్టుకుపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని కామెంట్ చేశారు. కనీసం అప్రమత్తం చేసే వాళ్లు కూడా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజంపేట మండలం ఎగువ మందపల్లిలో బాధితులకు దుప్పట్లు అందజేశారు.కడపలో భారీ వర్షాలకు నానిపోయి ఓ భవనం కుప్పకూలింది. రాధాకృష్ణనగర్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో మూడు అంతస్తుల భవనం నేలమట్టమైంది.

శిథిలాల కింద చిక్కుకున్న తల్లి, ఇద్దరు పిల్లలను ఫైర్‌ సిబ్బంది రక్షించారు. పెద్ద శబ్ధం రావడంతో మొదటి అంతస్తులో ఉన్న మహిళ, ఇద్దరు పిల్లలు మినహా రెండో అంతస్తు నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు. అయితే.. ఈ భవనం శిథిలావస్తకు చేరిందని నగరపాలక సంస్థ అధికారులు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా యజమాని స్పందించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story