Kadapa Floods: రాత్రికి రాత్రే వరద ముంచెత్తింది.. ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది..

Kadapa Floods (tv5news.in)
Kadapa Floods: కడప జిల్లా వాసులు కనీవినీ ఎరుగని వరదలు ఇవి. వానల కోసం ఆశగా ఆకాశం వైపు చూసిన కడప జిల్లా ప్రజలు.. వరదలు ఎలా ముంచెత్తుతాయో ఏనాడూ చూసింది లేదు. రాత్రికి రాత్రే వరద ముంచెత్తింది, తెల్లారే సరికి సర్వ నాశనం చేసి వదిలింది. వర్షాల్లేక కరువుతో, ఆకలితో అలమటించిన రోజులు తెలుసు గానీ.. వరదల కారణంగా ఆకలి, దాహంతో అలమటించడం ఏనాడూ జరగలేదు.
ముఖ్యంగా రాజంపేట, నందలూరు మండల గ్రామాల్లో అయితే అత్యంత దయనీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కడప జిల్లాను వరదలు ఏ స్థాయిలో ముంచెత్తాయంటే.. ఇప్పటికీ గల్లంతైన తమ వాళ్లు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. శిథిలాల్లో ఉన్నారో, వీధుల్లో పేరుకుపోయిన బురదలో ఉన్నారో, చెట్టు పుట్టలో చిక్కుకుపోయారో తెలీదు. ఇళ్లు వాకిళ్లు నామరూపాల్లేకుండాపోయాయి.
డబ్బు, బంగారం, సామాన్లు, నిత్యావసర సరుకులు.. ఇలా ఏవీ మిగల్లేదు. రైతుల పొలాలు ఇసుకమేటలతో నిండిపోయాయి. పంటలు, గోదాంలో ఉంచిన నిల్వలు ఏవీ మిగల్లేదు. బైకులు, కార్లు యాడికి కొట్టుకుపోయాయో తెలీదు. ఒకరికి ఒకరు సాయంగా నిలిచే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క ఇల్లు వరదలకు నాశనం అయింది. కడప జిల్లాలో వరదల కారణంగా 13 మంది చనిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.
దాదాపు 11 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. తమ వాళ్లు ఎక్కడైనా తలదాచుకుని ఉండొచ్చేమోనన్న ఆశతో అదే కట్టుబట్టలతో వెతుక్కుంటున్న వాళ్లూ ఉన్నారు. ముఖ్యంగా అన్నమయ్య రిజర్వాయర్ కట్ట తెగి ధ్వంసమవడంతో.. చుట్టు పక్కల గ్రామాలను జలప్రళయంలా ముంచెత్తింది. బహుదా నది ఒడ్డున ఉన్న గ్రామాల రూపురేఖలు చెదిరిపోయాయి. రాజంపేట మండలం తొగురుపేట, రామచంద్రాపురం.. నందలూరు మండలం పాటూరు, నీలిపల్లి, ఇసుకపల్లి, గొల్లపల్లి, గుండ్లూరు, చొప్పవారిపల్లె, నందలూరు గ్రామాల్లో ఎటు చూసినా శిథిల ఇళ్లే దర్శనమిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com