AP Rains: కడపను వదలని భారీ వర్షాలు.. నీళ్లల్లోనే ప్రజల అవస్థలు..

AP Rains: కడప జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. కడప పట్టణంలో కొత్త బస్టాండ్, మృత్యుంజయ కుంట, నాగరాజుపేట, చిన్నచౌకు, రాజంపేట రోడ్డు..10 కార్పొరేషన్ వార్డుల్లో వరదనీరు ఇళ్లలోకి చేరింది. దీంతో నగరవాసులు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు వరదఉధృతితో చెరువులు ప్రమాదకర స్థాయికి చేరాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
ఇప్పటికే జిల్లాలోని చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. చిట్వేలి మండలం అనుంపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో రాజగుంట అలుగు ఉగ్రరూపం దాల్చింది. రోడ్డుపై నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. చిట్వేలి నుంచి రాపూరు మీదుగా నెల్లూరు వెళ్లాల్సిన వాహనాలను ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. చింతకొమ్మదిన్నె మండలం ఉటుకూరు చెరువు ప్రమాదకరంగా మారింది.
తాత్కాలిక మరమ్మతులు చేసిన చోట కట్ట కుంగడంతో దిగువ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వ ప్రకృతినగర్, బాలాజీనగర్, భగత్‌సింగ్ నగర్, అల్లూరి సీతారామనగర్‌తో పాటు ఐటీ సర్కిల్ కాలనీలకు ముప్పు పొంచి ఉంది. అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలు చేపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com