Kapu Forum: ఏపీలో కొత్త ఫోరమ్‌ ఏర్పాటు చేసే పనిలో కాపు సామాజికవర్గ పెద్దలు..

Kapu Forum: ఏపీలో కొత్త ఫోరమ్‌ ఏర్పాటు చేసే పనిలో కాపు సామాజికవర్గ పెద్దలు..
X
Kapu Forum: కాపు సామాజికవర్గంలోని కొందరు కొత్త పార్టీ పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Kapu Forum: కాపు సామాజికవర్గంలోని కొందరు పెద్దలు, నేతలు కొత్త పార్టీ పెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కొత్త పార్టీకి కావాల్సిన ఆర్థిక వనరుల సమీకరణకు విశాఖలోని దస్పల్లాను కేంద్రంగా మార్చుకున్నారనే విమర్శలూ వినిపించాయి.

ముఖ్యంగా ఈ ఆర్ధిక వనరుల సమీకరణలో ఓ వైసీపీ వీరాభిమాని కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పుకుంటున్నారు. కాని, ఇది తాడేపల్లి వ్యూహమేనన్న విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు కొన్ని జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కాపు పార్టీలోని వ్యక్తులు స్వతంత్రంగా వ్యవహరిస్తారనే కలరింగ్ ఇవ్వడం కోసమే.. ఈ వనరుల సమీకరణను తెరపైకి తెచ్చారా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

కాపు కొత్త ఫోరమ్‌లో తెర వెనుక ఏదేదో జరుగుతోంది. తాడేపల్లి క్యాంప్‌ ఇచ్చిన డైరక్షన్ ప్రకారం పార్టీలో చేర్చుకోవాలనుకున్న కీలక కాపు నేతలు, మేధావుల్ని ముందుగానే పక్కకు తప్పించారని తెలుస్తోంది. ఆల్రడీ పవన్ కల్యాణ్‌కు ఈ ఫోరమ్‌లో ఎంట్రీ ఇవ్వలేదు. మొదటి సమావేశం తరువాత వంగవీటి రాధానూ రానివ్వలేదు.

ఇక రెండో సమావేశం ముగిసిన తరువాత మాజీ పోలీస్ అధికారి, బీజేపీ కీలక నేత గుడ్ బై చెప్పేశారు. మరో మూడో సమావేశం తరువాత ఎవరికి ఎర్త్ పెట్టబోతున్నారోనని ఆ గ్రూప్‌లోని వాళ్లే మాట్లాడుకుంటున్నారు. కాపు పార్టీలో చక్రం తిప్పుతున్న విశాఖ నేత లక్ష్యమేంటనే దానిపై కాపు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవడమే సదరు విశాఖ నేత లక్ష్యమా అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలేవీ ఆ విశాఖ నేతను పట్టించుకోవడం లేదన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రధాన పార్టీలు పట్టించుకోకపోవడంతో.. జనసేన నుంచి అయినా పోటీచేసి.. ప్రతిష్ట కాపాడుకోవాలని ఆ విశాఖ నేత ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

విశాఖ నేత ఓ వ్యూహం ప్రకారమే తాడేపల్లి క్యాంప్‌తో ఒప్పందం చేసుకున్నారా అనే అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. కొత్త పార్టీతో కాపు సామాజికవర్గంతో పాటు బహుజనులకు ప్రయోజనాలు కూడా ఉన్నాయనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా జనసేన, వంగవీటి కుటుంబాల్ని దెబ్బకొట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారని అనుమానిస్తున్నారు.

ఈ ప్లాన్‌ మొత్తం తాడేపల్లిలోనే జరిగిందని, ఏడాది నుంచి తాడేపల్లిలో మంతనాలు సాగుతున్నాయని, తాడేపల్లి కీలక నేతలు రచించిన వ్యూహాన్నే అమలు చేస్తున్నారని కొందరు కాపు పెద్దలు కూడా చెబుతున్నారు. ఎలాగూ కాపు సామాజికవర్గానికో పార్టీ అనగానే పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తారు కాబట్టి.. జనసేన బలం తగ్గించడమే లక్ష్యంగా వ్యూహరచన సాగిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది.

పైగా ఈ కొత్త పార్టీపై వంగవీటి రాధ మూడ్ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకే మొదటి సమావేశానికి ఆహ్వానించారేమోనని చెబుతున్నారు. ఈ అనుమానం నిజమే అనడానికి రెండో సమావేశాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. జగన్ పట్ల వంగవీటి రాధ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనే విషయం మొదటి సమావేశంలోనే గుర్తించిన కాపు పెద్దలు.. రెండో సమావేశం నుంచి రాధను తప్పించారని చెప్పుకుంటున్నారు.

Tags

Next Story