Konaseema District: కోనసీమ జిల్లాలో సాధారణ పరిస్థితులు.. కానీ నెలాఖరు వరకు..

Konaseema District: కోనసీమ జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అల్లర్లతో అట్టుడికిన అమలాపురం ప్రశాంతంగా ఉంది. పలు ప్రాంతాల్లో పోలీసుల పహారా కొనసాగుతుండగా.. ప్రధాన కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేశారు. ఈనెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ విధించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.
అటు ఈ అల్లర్లకు కారణమైన 46 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 19 మందిని అరెస్ట్ చేశారు. విధ్వంసాలు చేసిన వంద మందిని గుర్తించామని.. మరింత మందిని అరెస్ట్ చేస్తామని డీఐజీ పాల్‌రాజు తెలిపారు. ఇవాళ్టి నుంచి దర్యాప్తును మరింత వేగవంతం చేసామని.. త్వరలో మరికొందరు నిందితులను అరెస్టు చేస్తామన్నారు. కోనసీమలో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఇంటర్నెట్ సేవలకు అంతరాయం తప్పదని డీఐజీ పాలరాజు అన్నారు.
మరోవైపు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ నగదు చెల్లింపులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇంటర్నెట్ సేవలు లేక మూడ్రోజులుగా అవస్థలు పడుతున్నారు. ఈనెల 29న పాలీసెట్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో కనీసం హాల్‌టికెట్లు కూడా డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలులేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు. అరెస్టు చేసిన నిందితులకు సంబంధించినవారిపై దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com