Vijayawada : రైతును ముంచిన కృష్ణమ్మ.. ప్రతి పంట సర్వనాశనం
అన్నదాతను కృష్ణమ్మ వరద.. కష్టాల సుడిగుండంలోకి తోసింది. వరద తగ్గు ముఖం పట్టడంతో రైతులు పడవలపై లంకలకు వెళ్లి నీట మునిగిన పంటలను చూసి కన్నీటిపర్యంతమవుతున్నారు. పంట పొలాల్లో ఉన్న నీటిని బయటకు తొలగించడానికి ముప్పతిప్పలు పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదకు వాణిజ్య పంటలకు అపార నష్టం వాటిల్లింది.
పంటలు పూర్తిగా ఒండ్రుతో నిండి పోయాయి. పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల పరిధిలోని లంకల్లో ఎక్కువ మంది రైతులు పసుపు, కంద అరటి, తమలపాకు, కూరగాయల పంటలు వేశారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. తోట్లవల్లూరు, పమిడిముక్కల లంకల్లో సుమారు 10వేల ఎకరాల్లో పలురకాల ఉద్యాన పంటలు వేశారు.... మూడు రోజులపాటు ముంపులోనే ఉండటంతో పూర్తిగా పాడయ్యాయని అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
ఎన్నడూ లేనివిధంగా కృష్ణానదికి పోటెత్తిన వరదలవల్ల వాణిజ్యపంటలను సాగుచేసుకునే చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూశారు. పైనుంచి వచ్చే వరద తీవ్రత పెరగడంతో పొలాల్లో 20 అడుగుల మేర నీరు ప్రవహించి పంటలన్నీ సర్వనాశనం అయిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టిన పసుపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పంటంతా సర్వనాశనం కావడంతో దిక్కుతోచనీ స్థితిలో పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంకల్లో ఎక్కువగా వేసిన కంద, అరటితోటలు, మొక్కజొన్న, కూరగాయల తోటలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు తిరిగి పంటవేసినా పురుగుల బెడదతో నష్టం వాటిల్లక తప్పదని... దసరా దాటిన తర్వాతే తిరిగి సాగు మొదలుపెట్టే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com