Kuppam: కుప్పంలో వైసీపీ నేత సెల్ఫీ సూసైడ్.. పదవి కోసం లంచం ఇచ్చి మోసపోయి..

Kuppam: కుప్పం వైసీపీ నేత పార్థసారథి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ ఛైర్మన్‌గా తనను కొనసాగించలేదనే మనస్తాపంతోనే ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. గంగమ్మ ఆలయ ఛైర్మన్ పదవి కోసం తాను 15 లక్షలు ఇచ్చినట్టు పార్థసారథి చెప్పారు.
అలాగే మరో 20 లక్షలు కూడా ఖర్చుపెట్టానని.. మొత్తంగా 35 లక్షల రూపాయల మేర అప్పుల పాలు అయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా 2 ఏళ్లుగా గంగ జాతర నిర్వహించలేదని.. ఈసారి జాతర చేశాక ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటానని చెప్పినా ఒప్పుకోకుండా తనను బలవంతంగా తప్పించారన్నారు. YCP కోసం కష్టపడి పనిచేసినా తనకు అవమానం ఎదురైందంటూ సెల్ఫీ వీడియోలో భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.
కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి ఛైర్మన్ పదవి విషయంలో చాలా హైడ్రామా సాగినట్టు బంధువులు, స్థానికులు చెప్తున్నారు. పార్థసారథిని తప్పించి మంచునాథ్‌ను ఆ పదవిలో కూర్చోబెట్టడం, పార్థసారథిని డైరెక్టర్‌గా ఉంచడం లాంటివి ఇటీవల తీవ్ర స్థాయిలోనే విభేదాలకు కారణం అయ్యాయి. చివరికి ఇదంతా పార్థసారధి రైలు కింద పడి సూసైడ్ చేసుకోవడానికి కారణమైంది.
కుప్పం ఫ్లైఓవర్ సమీపంలో పట్టాలపై డెడ్‌బాడీని గుర్తించిన వెంటనే వాల్మీకి బోయ సామాజికవర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోస్ట్‌మార్టం వద్ద పరామర్శకు వచ్చిన YCP నేతల్ని సైతం అడ్డుకున్నారు. తన బలవన్మరణానికి కుప్పం వైసీపీ కౌన్సిలర్ భర్తతోపాటు మరో ఇద్దరు బాధ్యులంటూ అతను సెల్ఫీ వీడియోలో చెప్పడంతో అసలేం జరిగిందో తేల్చేలా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటు.. నమ్మి డబ్బులు ఖర్చు పెడితే తననే మోసం చేశారంటూ పార్థసారధి చెప్తున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com