Andhra Pradesh: ప్రజల ఒరిజినల్ ఆస్తి పత్రాలు సర్కారు గుప్పిట్లో

ప్రజల ఆస్తులను తన గుప్పిట్లోనే ఉంచుకొనే భారీ కుట్రకు జగన్ సర్కారు తెర తీసిందా? రాష్ట్రంలో ఆస్తి ఏదైనా, ఎవరిదైనా ఇకనుంచి రిజిస్ట్రేషన్ జరిగితే వాటి ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం వద్దే కంప్యూటర్లలో ఉంటాయి. ప్రజల చేతికి జిరాక్స్ కాపీ మాత్రమే ఇస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తై ఒరిజినల్ దస్తావేజులు అందించడంలో జాప్యం జరుగుతోందని..., ఈ జాప్యాన్ని నివారించేందుకే ఈ విధానం చేపడుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఒరిజినల్ పత్రాల స్థానంలోకి జిరాక్స్ పత్రాలు చేరితే ఆర్థిక మోసాలకు తలుపులు తెరిచినట్టేనన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఒకే ఆస్తిని ఎన్నిసార్లైనా అమ్ముకునేందుకు సర్కారే ద్వారాలు తెరిచినట్టు అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం వద్ద ఒరిజినల్ ఆస్తి పత్రాలు సేఫ్‌గా ఉంటాయో లేదోనన్న భయం ప్రజల్లో ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలను చైతన్యపరచకుండా మాన్యువల్ నుంచి ఆన్‌లైన్‌లోకి మారమంటే ఎలా అంటూ వాదిస్తున్నారు. అయితే, సర్కారు మాత్రం ద్రాక్షారామంలో వారం రోజుల నుంచి, విజయవాడలో బుధవారం నుంచి పైలట్‌గా అమల్లోకి తెచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరు 15వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం కార్డ్‌ప్రైమ్ మాడ్యూల్ అనే విధానం తీసుకొచ్చి అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ప్రవేశపెడుతున్నారు.
ఫిజికల్ డాక్యుమెంట్‌లో ఏవైనా తప్పులు దొర్లితే ఒక్క అక్షరమైనా సరిదిద్దాలంటే మళ్లీ రెండు పార్టీల సంతకాలు తీసుకునే చేస్తారు. దస్తావేజు సిద్ధమయ్యాక ఒకటికి రెండుసార్లు సబ్‌రిజిస్ర్టార్లు, కిందిస్థాయి అధికారులు సరిచూసి సంతకాలు చేస్తారు. తాజా విధానం ప్రకారం... ఫిజికల్ డాక్యుమెంట్ చేతిలో లేకపోతే వాటిని సరిచూడడం సాధ్యమయ్యే పనికాదని సబ్ రిజిస్ట్రార్లే చెప్తున్నారు. ఒకవేళ ఇ-డాక్యుమెంటులో తప్పులు దొర్లితే ఎవరు చూడాలి.. వాటిని ఎలా మార్చాలి? కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు పాటించాల్సిన పద్ధతులను జగన్ సర్కారు గాలికి వదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజల్లో చర్చ పెట్టాలని... ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలని... అలాకాకుండా నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లంటూ ప్రభుత్వం హడావుడి చేస్తోంది. గ్రామాల్లో ఒక మోస్తరు చదువుకున్నవారికైనా రిజిస్ట్రేషన్ పరిజ్ఞానం శూన్యం. సీనియర్ రిజిస్ట్రార్లే రాజకీయ నాయకుల ఒత్తిళ్లు తట్టుకోలేక చాలాచోట్ల చేతులెత్తేస్తున్నారు. అలాంటిది గ్రామాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్న పంచాయతీ సెక్రటరీలపై ప్రలోభాలు, ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్తి కొనుగోలు చేసిన వారికి ఒరిజినల్ ఇవ్వకుండా జిరాక్స్ చేతిలో పెట్టి, అందులో ఉన్నదే వాస్తవమంటే ఎలా నమ్మగలం? మరోవైపు.. జిరాక్సు కాపీని ఎన్ని బ్యాంకుల్లోనైనా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. అదే ఒరిజినల్ కాపీ ఆస్తిదారుడి వద్ద ఉంటే ఈ తరహా మోసాలకు ఆస్కారం ఉండదని అంటున్నాయి.
కార్డ్‌ప్రైమ్ మాడ్యూల్ విధానాన్ని అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ప్రవేశపెడుతున్నారు. ఇదొక పబ్లిక్ డేటా ఎంట్రీ విధానం. ప్రజలే నేరుగా తమ వివరాలు, కొనుగోలు చేయాలనుకుంటున్న ఆస్తి వివరాలు, రెండు పార్టీల వివరాలు పొందుపర్చి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మార్కెట్ విలువ, స్టాంపు డ్యూటీ, చార్జీలు ఎంత చెల్లించాలనేది కంప్యూటర్‌లో జనరేట్ అవుతుంది. దీన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి, రిజిస్ట్రేషన్‌కు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ వ్యక్తి ఇచ్చిన వివరాల ఆధారంగా ఆన్‌లైన్‌లోనే డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత రెండు పార్టీలు ఆధార్‌తో అనుసంధానిస్తారు. ఇ-సంతకాలు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాలి. ఇలా చేస్తే ఫిజికల్ డాక్యుమెంటు తేవాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి వేలిముద్రలు వేస్తే ఆ వ్యక్తి దరఖాస్తు చేసుకున్న పత్రాలు కంప్యూటర్‌లో కనిపిస్తాయి. సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ-సంతకం చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది. ఒరిజినల్ డాక్యుమెంటు ప్రభుత్వ కంప్యూటర్‌లో ఉండిపోతుంది. దాన్ని జిరాక్స్ తీసి ఆ వ్యక్తికి ఇస్తారు.
కార్డ్‌ప్రైమ్ మాడ్యూల్‌తో సమయం ఆదా అవుతుందని, వివరాలన్నీ ముందుగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుతాయని.. దీంతో రిజిస్ట్రేషన్ సమయంలో జాప్యం తగ్గుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, ఈ పనులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఎంతమంది చేసుకోగలరనేది ప్రశ్నార్థకం! ఏ కంప్యూటర్ సెంటర్‌కో వెళ్లి, మన ఆస్తుల వివరాలన్నీ చెప్పి దరఖాస్తు చేసుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియలో రెండు పార్టీలవి, సబ్ రిజిస్ట్రార్లవీ ఫిజికల్ సంతకాలు ఎక్కడా ఉండవు. ఫిజికల్ డాక్యుమెంట్లు ఎక్కడా ఉండవు.
ఐతే.. రాష్ట్రంలో తాజాగా ప్రారంభమైన ఆన్‌లైన్‌లో దస్తావేజులను రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం సంక్లిష్టంగా ఉంది. ఓటీపీ ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగేలా ఆన్‌లైన్ విధానాన్ని రూపొందించారు. ఆన్‌లైన్‌లో క్రయ, విక్రయదారుల వివరాలను నమోదు చేయగానే వారి సెల్‌ఫోన్లకు ఓటీపీ వస్తుంది. వీరు ఎంత మంది ఉంటే.. అంత మందికి వారి ఆధార్ నంబరుకు అనుసంధానమైన సెల్‌ఫోన్లకు ఓటీపీ ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తుంది. ఓటీపీ వచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో ఆ సంఖ్యను నమోదుచేయాలి. నిర్ణీత వ్యవధిలో ఓటీపీలు నమోదు చేయకుంటే మళ్లీ మొదటి నుంచి ప్రక్రియను ప్రారంభించాల్సి వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com