AP: మద్యం కుంభకోణంలో కేశినేని బ్రదర్స్ వార్

మాజీ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని చిన్ని మధ్య వివాదం తారస్థాయికి చేరుతోంది. తాజాగా నాని చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తన సోదరుడు చిన్ని మద్యం కుంభకోణానికి సంబంధిత వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని నాని ఆరోపించారు. నాని ఇటీవల తన 'ఎక్స్ ' ఖాతా ద్వారా చేసిన పోస్ట్‌లలో, ఏపీలో మద్యం అక్రమాల కేసులో అరెస్ట్ అయిన కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి , దిలీప్ పైలాలతో తన సోదరుడు కేశినేని చిన్ని సంబంధాలు కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబునినాని ట్యాగ్ చేసి, దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కంపెనీ లింకులు ఏంటి?
నాని వెల్లడించిన సమాచారం ప్రకారం, కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి, కేసిరెడ్డి కలిసి ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ LLP అనే సంస్థకు భాగస్వాములుగా ఉన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఈ సంస్థ అడ్రస్‌లోనే మరో సంస్థ ఇషాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేసిరెడ్డి, దిలీప్ పైలా కలిసి రిజిస్టర్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలు ఒకే ఈమెయిల్ ఐడీని ఉపయోగిస్తున్నాయని, ఇది అనుమానాలకు తావిచేస్తోందని నాని ఆరోపించారు. అంతేకాకుండా, మద్యం కుంభకోణంలో లభించిన నగదు ద్వారా చిన్ని హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్‌తో పాటు విదేశీ కంపెనీల్లోనూ పెట్టుబడులు పెట్టారని నాని ఆరోపించారు. నగదు అక్రమ చలామణీకి పాల్పడ్డట్టు సంకేతాలున్నాయని తెలిపారు.
చిన్ని కౌంటర్
నాని ఆరోపణలపై కేశినేని చిన్ని స్పందిస్తూ, "ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని" అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ముందే, కేసిరెడ్డి కంపెనీతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు. "మా కంపెనీ స్థలం దగ్గరే వారు సంస్థ ప్రారంభించారు. అందుకే 2021లో నిర్మాణ అవసరాల కోసం కంపెనీ రిజిస్టర్ చేసుకున్నాం" అని వివరించారు. నాని చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com