ఆన్‌లైన్ యాప్ వేధింపులపై ఏపీలో తొలి కేసు నమోదు

ఆన్‌లైన్ యాప్ వేధింపులపై ఏపీలో తొలి కేసు నమోదైంది. వడ్డీ చెల్లింపులో కాస్త ఆలస్యమైనందుకు.. గుంటూరుకు చెందిన దుర్గ అనే మహిళను యాప్ నిర్వాహకులు హడలెత్తించారు. అవసరాలరీత్యా.. కొన్ని యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నారు దుర్గ. సకాలంలో రుణం చెల్లించలేకపోయారు. దీంతో నిర్వాహకుల నుంచి వేధింపులు అధికమయ్యాయి. ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ల జాబితా కాపీ చేసి ఆమెకే పంపారు. ఆ జాబితా చూసిన దుర్గ షాక్ అయ్యారు. లోన్ తీసుకొని ఎగ్గొట్టారని ఫోన్‌లోని కాంటాక్ట్ నెంబర్లన్నింటికీ మెసేజ్‌లు పంపుతామని బెదిరించారు. ఒకవేళ ఫోన్ స్విచ్చాఫ్ చేసినా వారందరికీ మెసేజ్‌లు పంపుతామని హెచ్చరించారు. వేధింపులు తట్టుకోలేక ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు దుర్గ. చివరి ప్రయత్నంగా గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సమయంలో కూడా లోన్ నిర్వాహకుల నుంచి దుర్గకు రెండు ఫోన్లు వచ్చాయి. దీంతో యాప్ నిర్వాహకుల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com