LOKESH: భారత్‌లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గేట్ వే

భారత్-ఆస్ట్రేలియాల నడుమ స్నేహపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగుతోందని ఏపీ విద్య, ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు కీలకమైన ఎగుమతుల్లో శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు,ఆభరణాలు,వ్యవసాయ ఉత్పత్తులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. బ్రిస్బేన్‌లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.
గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో గోల్డ్ కోస్ట్ క్యాంపస్‌లో భేటీ అయ్యారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ కళాశాలలో అధునాతన క్రీడా సౌకర్యాలను పరిశీలించారు. పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం చొరవ చూపాలన్నారు. ఆంధ్రప్రదేశ్-గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని కోరారు. పరిశోధన, విద్యార్థుల మార్పిడి, అవగాహన సమన్వయానికి ఏపీలో హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిలబస్, నైపుణ్య ధ్రువీకరణకు ఏపీ వర్సిటీలతో భాగస్వామ్యం వహించాలని కోరారు.
‘‘పునరుత్పాదక శక్తి, ప్రజారోగ్యం, నీటి నిర్వహణ రంగాల్లో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు ప్రారంభించాలి. గ్రిఫిత్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ విద్యాసంస్థల మధ్య డ్యూయల్ డిగ్రీ లేదా ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయాలి. స్కాలర్షిప్లు, అధ్యాపకులు, విద్యార్థుల అభివృద్ధికి ఎక్స్చేంజి కార్యక్రమాలను ప్రోత్సహించాలి. నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించే విశాఖ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలి. స్టార్టప్‌లకు మద్దతునిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయాలి’’ అని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
స్మార్ట్ ఫార్మింగ్ సాయానికి విజ్ఞప్తి
ఏపీలో ఏఐ ఆధారిత స్మార్ట్ ఫార్మింగ్ కు సహకారం అందించాలని లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులను కోరారు. ఈ మేరకు యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో భేటీ అయ్యారు. ఏఐ ఆధారిత వ్యవసాయ హబ్ ల ఏర్పాటు ద్వారా ఏపీలో వ్యవసాయ ఆధునీకరణకు సహకరించాలన్నారు. వాతావరణ మార్పులను తట్టుకోగలిగే పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్ లో నైపుణ్యాలను ఆచార్య ఎన్.జి.రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలన్నారు. రైతులు, అగ్రి-ప్రొఫెషనల్స్ కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్‌లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధన ఆధారిత సూచనలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సంబంధాలలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులకు ఏపీ ప్రధాన గమ్యస్థానంగా మారిందని ఆయన అన్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య సుహృద్భావపూర్వక ద్వైపాక్షిక వాణిజ్యం నిరంతరంగా సాగుతోందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com