సర్కారు తాత్సారం వల్ల అవ్వాతాతలు ఇప్పటికే రూ 1000 నష్టపోయారు : లోకేష్
పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావించిన లోకేష్.. పెన్షన్ విషయంలో జగన్ రెడ్డి గారి మోసాలు అన్నీ ఇన్నీ కావన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వేల పెన్షన్ అన్నారు.. ఆ తర్వాత మాట మార్చి..మడమ తప్పి ప్రతి ఏడాది పెన్షన్ రూ. 250 పెంచుతూ పోతానన్నారు. జులై నుంచి 2వేల 500 పెన్షన్ రావాల్సి ఉన్నా.. తాత్సారం చేస్తున్నారని.. దీనివల్ల అవ్వా తాతలు ఇప్పటికే వెయ్యి రూపాయలు నష్టపోయారని లోకేష్ విమర్శించారు. సంక్షేమ క్యాలెండర్‌లో అవ్వా, తాతల పెన్షన్ పెంపు ప్రస్తావన లేకపోవడం దారుణమని లోకేష్ మండిపడ్డారు. మే 30, 2019 రోజున జగన్ రెడ్డి గారి మొదటి సంతకం ప్రకారం జారీ చేసిన జీవో 103 లో 2 వేల పెన్షన్‌ని.. రూ. 2 వేల 250 కి పెంచుతున్నట్లు ఎందుకు ఉందో సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను పెంచి జులై నుంచి ఉన్న బకాయిలు కూడా పెన్షనర్లకు చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com