LOKESH: విద్యార్థికి లోకేశ్‌ అండ

LOKESH: విద్యార్థికి లోకేశ్‌ అండ
ట్రిబుల్‌ ఐటీలో చదవాలన్న కల సాకారం చేస్తానన్న లోకేశ్‌

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించిన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన విద్యార్థి నాగబసవయ్య ఫీజు చెల్లింపు బాధ్యతలు తాను తీసుకుంటానని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. లఖ్‌నవూ ట్రిబుల్‌ ఐటీలో చదవాలన్న మీ కలల్ని సాకారం చేసుకునేందుకు తాను సహకరిస్తానని లోకేశ్‌ తెలిపారు. ఫీజు సంగతి తాను చూసుకుంటానని... ఆల్‌ ది బెస్ట్‌ బసవయ్య అంటూ ఎక్స్‌లో లోకేశ్‌ పేర్కొన్నారు. ఐఐటీ జామ్‌-2024లో నాకు 930 ర్యాంకు వచ్చింది. లఖ్‌నవూ ట్రిబుల్‌ ఐటీలో డేటా సైన్స్‌ కోర్సులో సీటు సాధించా. దీనికి గాను రూ. 4 లక్షల వరకు ఫీజు అవుతుందని... తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తన చదువుకు సాయం చేయాలని లోకేశ్‌ను అభ్యర్థిస్తూ బసవయ్య చేసిన పోస్టుపై ఆయన పైవిధంగా స్పందించారు.

చంద్రబాబు అపర భగీరథుడు

చంద్రబాబు అపరభగీరథుడు అని.. రాయలసీమనే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన సత్తా చంద్రబాబుకే ఉందని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. రాయలసీమలో పెండింగ్‌లో ఉన్న సాగు-తాగునీటి ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయని ఆయన తెలిపారు. పెన్నా-గోదావరి నదుల అనుసంధానానికి సీఎం భగీరథ యజ్ఞం చేస్తున్నారని వెల్లడించారు. సిద్థేశ్వరం బ్యారేజ్‌ను ఐకాన్ బ్రిడ్జ్‌గా మార్చాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. విభజన హామీల్లో వచ్చింది తీసుకోవాలి.. లేని దాని కోసం పాకులాడకూడదన్నారు.

విభజన హామీలు వచ్చే వాటిపై కామెంట్ చేస్తే మనకే నష్టమంటూ పేర్కొన్నారు. ఫ్యాక్షన్‌ను అణచి వేయడంలో చంద్రబాబు దిట్ట అని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని టీజీ వెంకటేష్ చెప్పారు. మోడీ ఆశీస్సులు మనకు మెండుగా ఉన్నాయి.. మోడీ ఆశీస్సులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతాయన్నారు. మదనపల్లి దగ్ధం కేసులో చట్టం తన పని తాను చేస్తోందని.. తప్పు చేసి ఉంటే ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు.

Tags

Next Story