LOKESH: ఏపీ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ

ఏపీలో యువతకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సిడ్నీలోని ప్రఖ్యాత ప్రభుత్వ వృత్తి విద్యా సంస్థ టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ(టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్) అల్టిమో క్యాంపస్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రతిపాదనలు చేశారు. తర్వాత సిడ్నీ రాండ్విక్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్(యూఎన్ఎస్డబ్ల్యూ)ను ఆయన సందర్శించారు. వర్సిటీ ప్రతినిధులు లోకేశ్‌కు స్వాగతం పలికారు. అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి చర్చించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు, స్టూడెంట్ ఎక్స్చేంజి పథకాలను ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా కృత్రిమ మేధ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్ యువతకు అధునాతన టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. ఏపీలో పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైన వ్యవసాయం, నీటి నిర్వహణ అంశాల్లో ఏపీ వర్సిటీలతో కలిసి సంయుక్త పరిశోధనలు చేపట్టాలని సూచించారు. ఏపీలోని కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం వంటి పారిశ్రామిక క్లస్టర్లలో ఆస్ట్రేలియా కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాల్సిందిగా కోరారు. 2025లో విశాఖలో ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాల్సిందిగా ఆండ్రూ గైల్స్‌ను లోకేశ్ ఆహ్వానించారు. టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ క్యాంపస్‌కు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు మేనేజింగ్ డైరెక్టర్ క్లో రీడ్, ఇతర ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ-అకడమిక్ భాగస్వామ్యంలో టీఏఎఫ్ఈ ఎన్ఎస్డబ్ల్యూ కీలక పాత్ర పోషిస్తోందని, ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలతో కలిసి పనిచేస్తోందని ఆస్ట్రేలియా మంత్రి గైల్స్ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com