LOKESH: జగన్ మరీ ఇంత పిరికివాడా: నారా లోకేశ్

అసెంబ్లీకి రావట్లేదంటేనే జగన్ ఎంత పిరికివాడో అర్ధమవుతోందని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా చివరి రోజు వరకూ అసెంబ్లీలో పోరాడామని గుర్తుచేశారు. చంద్రబాబు అసెంబ్లీని ఏ సందర్భంలో వదిలారో వీడియో రికార్డులతో సహా ప్రజలంతా చూశారని నారా లోకేశ్ గుర్తు చేశారు. అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేసినా చంద్రబాబు ఒక్కరే తన వాదన వినిపించి ప్రజా సమస్యలపై పోరాడారని చెప్పారు. అసెంబ్లీకి రాకుండా దొంగచాటుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టే రిజిస్టర్ సభ లోపల పెట్టేలా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జగన్ అసెంబ్లీకి రావచ్చని సరిపడా సమయం స్పీకర్ ఇస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వచ్చి జగన్ అన్ని మాట్లాడవచ్చన్నారు. జగన్ మైక్ స్పీకర్ ఎందుకు కట్ చేస్తారని ప్రశ్నించారు. కనీసం తన సొంత నియోజకవర్గమైన పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తీసుకురావాలన్న ఆలోచన ఆయనకు లేదా అని నిలదీశారు. వైసీపీ ఎప్పుడూ కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తుందని, ఆ పార్టీ చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
జగన్ ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లవచ్చని, ప్రభుత్వం ఎలాంటి గృహ నిర్బంధాలు విధించబోదని లోకేశ్ స్పష్టం చేశారు. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూసినా, పెట్టుబడిదారులను భయపెట్టే ప్రయత్నాలు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారం మొత్తం కీలక సమావేశాలతో తీరిక లేకుండా ఉన్నారని, ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువగా తిరగవద్దని చెప్పినా ఆయన ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల గురించి మాట్లాడుతూ, వచ్చే ఏడాది జనవరి నాటికి ఏపీలో క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. అక్టోబర్ నుంచి రాష్ట్రానికి వరుసగా పెట్టుబడులు ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా నిర్విరామంగా కృషి చేస్తున్నామని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
ఒక తరగతికి.. ఒక టీచర్ : మంత్రి
ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగానే.. టీచర్ల నియామకం, తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మన బడి-మన భవిష్యత్తు కింద పాఠశాల భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విలీనంపై లోకేశ్ సమాధానం ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలను మించి ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com