LOKESH: ఏపీకి మేలు చేసే అవకాశాన్ని వదలదు

కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా ఉండేలా కృషి చేస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న లోకేశ్.. సిడ్నీలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది సీఎం చంద్రబాబేనని లోకేశ్ అన్నారు. ఆయన వయసు 75 ఏళ్లయినా.. 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారని చెప్పారు. వైకాపా హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రవాసాంధ్రులంతా ఆయనకు మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. బ్రిస్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు లోకేశ్‌ను కలిశారు. లోకేశ్ 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాం’లో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హై కమిషనర్ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతుల్ని అధ్యయనం చేస్తారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోలలో పాల్గొననున్నారు. పెట్టుబడిదారులతో చర్చలు జరపనున్నారు.
మోదీ సహకారం
‘‘చాలా రాష్ట్రాల్లో డబులింజన్ సర్కార్లు ఉన్నాయి. కానీ.. ఏపీలో డబులింజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్ర సహకారం వల్లే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఒక్క జూమ్కాల్తో ఆర్సెలార్ మిత్తల్ కంపెనీ ఏపీలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం చంద్రబాబు కోరగానే ప్రధాని మోదీ సహకరించారు. పవన్‌కల్యాణ్ సహకారంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అన్నిరంగాల్లో రాష్ట్రం నంబర్ వన్‌గా ఉండేలా కృషి చేస్తోంది. పోలవరం పనులు పూర్తిచేసి నీరందిస్తాం. రాష్ట్రానికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టవద్దు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యం. ఆస్ట్రేలియా కంపెనీల్లో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లలా పనిచేయాలి. మీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశముంటే మాకు చెప్పండి.. అన్ని విధాలుగా సహకారం అందిస్తాం. పెట్టుబడుల కోసం పక్క రాష్ట్రాలతో చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను ఎన్నో మాటలు అంటున్నారు.. క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్తున్నా. రాష్ట్రాలు పరస్పరం పోటీ పడితేనే భారత్ గెలుస్తుంది’’ అని లోకేశ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com