AndhraPradesh: ఏపీలో లెక్కకు మించి ప్రజా సమస్యలు.. చేపలు, రొయ్యల గురించా మాట్లాడేది: విపక్షాల కౌంటర్

AndhraPradesh: ఏపీలో లెక్కకు మించి ప్రజా సమస్యలు.. చేపలు, రొయ్యల గురించా మాట్లాడేది: విపక్షాల కౌంటర్
AndhraPradesh: అభివృద్ధి అంటే పులివెందులకు చేపలు, రొయ్యలు రావడం కాదని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి.

AndhraPradesh: ఏపీలో ప్రజా సమస్యలు లెక్కకు మించి వున్నాయి.. పరిష్కరించాల్సిన పనులు చాలానే ఉన్నాయి.. దారుణంగా మారిన రహదారులు ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి.. ఇన్ని సమస్యలుంటే వీటిని పరిష్కరించాల్సిన పాలకులు చేపల గురించి, రొయ్యల గురించి మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ప్రజలే బహిరంగంగా మాట్లాడుకున్నారు..

ఏపీలో ఇలాంటి పరిస్థితిని చూస్తామని తాము ఊహించలేదంటున్నారు.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే ఆలోచనలు చేయాల్సిన ముఖ్యమంత్రి.. కడప జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటల గురించి అంతా చర్చించుకుంటున్నారు.. పులివెందులకు చేపలు వచ్చాయని మురిసిపోతున్న ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం అంటూ సెటైర్లు వేస్తున్నారు రాజకీయ పార్టీ నేతలు.

అంటే.. పులివెందుల ప్రజలు ఎప్పుడూ చేపలు తినలేదా..? అక్కడసలు చేపలే అమ్మరా? చేపల మార్కెట్టే ఉండదా? జగన్ మాటలు వింటే.. ఇదే అర్ధం వస్తోందంటున్నారు. జీవితంలో పులివెందులకు చేపలు, రొయ్యల షాపులు వస్తాయని అనుకోలేదని జగన్ మాట్లాడడంపై పొలిటికల్ సర్కిల్‌లో సెటైర్లు పేలుతున్నాయి.

నిజానికి పులివెందులలో ఆక్వా కల్చర్‌ను డెవలప్‌ చేసి ఉంటే.. ఈ విధంగా మురిసిపోవడంలో అర్ధం ఉందంటున్నారు. ఎక్కడో పట్టిన చేపలను తీసుకొచ్చి పులివెందులలో అమ్మడాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడం ఏంటని విమర్శిస్తున్నారు. పులివెందులకు నీళ్లు తీసుకొస్తే.. చేపలు ఆటోమేటిక్‌గా అవే వస్తాయి కదా అని సలహా ఇస్తున్నారు. కాస్త నీళ్లిస్తే చేపలతో పాటు పంటలు కూడా పండుతాయని.. అటువంటి సందర్భాన్ని ఘనంగా చెప్పుకోవడంలో అర్థం ఉంది గాని.. చేపల కొట్లు పెడుతున్నందుకు ఇంతలా మురిసిపోవడమేంటో అర్థమవట్లేదని మాట్లాడుకుంటున్నారు.

అభివృద్ధి అంటే పులివెందులకు చేపలు, రొయ్యలు రావడం కాదని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి. అభివృద్ధి అంటే కియా తరహా పరిశ్రమలు రాయలసీమలో పెట్టడం అని గుర్తు చేస్తున్నారు. కడప స్టీల్‌ ప్లాంట్, కొత్త పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులు తీసుకొస్తే ఎవరైనా ఘనంగా చెప్పుకుంటారు గానీ.. మరీ చేపలు, రొయ్యలు పట్టుకొచ్చినందుకు ఇంతలా చెప్పుకోవడం హాస్పాస్పదంగా ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story