Anantapur : సినిమాను తలపించే లవ్‌స్టోరీ.. పెళ్లి, కిడ్నాప్, ఛేజింగ్‌లతో రియల్ స్టోరీ

అనంతపురం జిల్లాలో సినిమాను తలపించే లవ్‌స్టోరీ జరిగింది. ప్రేమికులు, పెద్దలకు ఇష్టంలేని పెళ్లి, కిడ్నాప్, ప్రేమికురాలి పోరాటం, పోలీసుల ఛేజింగ్‌లు, చివరికి సుఖాంతం.. ఇన్ని ట్విస్టులున్న స్టోరీ రాప్తాడులో జరిగింది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కిష్టపాడుకు చెందిన నవీన్ కుమార్, ఇర్ఫానా.. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రాప్తాడులోని పండమేరు వద్ద ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిన్న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు.. అబ్బాయిని కిడ్నాప్ చేయాలనుకున్నారు.
పెళ్లి చేసుకున్న ప్రేమికులు అనంతపురం వస్తున్నారని తెలుసుకున్న ఇర్ఫానా బంధువులు పక్కాగా ప్లాన్ చేసి.. నవీన్‌ను కారులో బలవంతంగా ఎక్కించుకెళ్లారు. వీరి నుంచి తప్పించుకున్న ఇర్ఫానా సరాసరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసింది. ఎస్పీ ఫకీరప్ప ఆదేశాలతో డీఎస్పీ వీర రాఘవరెడ్డి నేతృత్వంలోని టూటౌన్ పోలీసులు.. కిడ్నాపర్లను ఛేదించేందుకు రంగంలోకి దిగారు. జస్ట్ అరగంటలోనే కిడ్నాపర్లను పట్టుకున్నారు.
ప్రసన్నయపల్లి రైల్వే గేట్ సమీపంలో కారులో వెళ్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సకాలంలో స్పందించి కిడ్నాప్‌ను ఛేదించిన సీఐ జాకీర్ హుస్సేన్, ఎస్సై రాంప్రసాద్, ఇతర పోలీసులను ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com