Madanapalle case: మదనపల్లె కేసు సీఐడీకి

రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇది ప్రమాదం కాదని, కొందరు కావాలనే రికార్డులను దగ్ధం చేసేందుకు నిప్పు అంటించారని విచారణలో వెల్లడైంది. దీనిపై విచారణ ముమ్మరంగా కొనసాగుతుండగా, కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో కేసు మొత్తాన్ని మదనపల్లె పోలీసులు రెండు రోజుల్లో సీఐడీకి అప్పగించనున్నారు.
గత నెల 21వ తేదీ రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులు దహనం అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మదనపల్లె పోలీసులు తొమ్మిది కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకోవడంతో పలువురు ఉద్యోగులు, నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దగ్ధమైన వాటిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారంతో ముడిపడిన రికార్డులు, కీలకమైన నిషేధిత భూముల జాబితాకు సంబంధించి రికార్డులు ఉండటంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com