MAHANADU:అభివృద్ధికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్

MAHANADU:అభివృద్ధికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్
X
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరంభోపన్యాసంలో సంచలన ప్రకటన

కడప గడపలో అంగరంగ వైభవంగా మహానాడు 2025 ఆరంభమైంది. నవ్యాంధ్రలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పసుపు పండుగలో సీఎం చంద్రబాబు ఆరంభ ఉపన్యాసం చేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి పుష్పమాలతో ఘన నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఏపీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్ల మధ్య చంద్రబాబు.. ఐదు దశాబ్దాల టీడీపీ చరిత్రను కార్యకర్తలకు, నాయకులకూ మరోసారి గుర్తుచేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి చేపట్టిన కార్యక్రమాలు, అవినీతిపై చేసిన పోరాటం, రాష్ట్రాభివృద్ధి కోసం చేపడుతున్న ప్రణాళికలు ఇలా ప్రతీ అంశాన్నీ చంద్రబాబు వివరించారు.

భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు

కడప గడపలో జరుగుతున్న మహానాడుకు తొలిరోజు తెలుగు తమ్ముళ్లు భారీగా తరలి వచ్చారు. మహానాడు వేదికగా చంద్రబాబు చేసిన ప్రసంగం టీడీపీ కార్యకర్తలను ఉద్వేగానికి లోనయ్యేలా చేసింది. పసుపు సింహం, టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య పీక కోస్తున్నా సరే జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు విడిచారని, అటువంటి కార్యకర్తలే పార్టీకి స్ఫూర్తి అని చంద్రబాబు అన్నారు.కడప గడ్డపై తొలిసారి మహానాడు నిర్వహిస్తున్నామని, ఈ మహానాడు చరిత్ర సృష్టిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన ఇటువంటి కార్యకర్తల స్ఫూర్తి పార్టీని నడిపిస్తోందని చంద్రబాబు చెప్పారు. వైసీపీ విధ్వంసకర పాలనతో రాష్ట్రం సర్వ నాశనం అయిందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రాణాలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పని అయిపోయింది అని మాట్లాడిన వారికి సమాధానం దీటుగా ఇచ్చామని, పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకుని అధికారం చేపట్టామని చంద్రబాబు అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి సాధించిన విజయం అసామాన్యమైనదని, అందుకు పసుపు సైనికులే కారణమని చెప్పారు. ఏమీ ఆశించకుండా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే గెలుపు సాధ్యమైందని అన్నారు.

సైనికుడిలా పోరాడుతా..?

ఏపీ అభివృద్ధి కోసం తాను సైనికుడిలా పోరాటం చేస్తానని.. పసుపు సైనికులు తోడుగా ఆకాశమే హద్దుగా ఆంధ్ర ప్రధేశ్ భవిష్యత్‌ను మారుస్తానని చెప్పారు. రాజకీయాల్లో టీడీపీ ట్రెండ్‌ సెట్టర్‌ అని.. టీడీపీ అంటే దశాబ్దాలుగా తెలుగు జాతి అభివృద్ధికి కృషి చేసిన పార్టీ అన్నారు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా.. అధికారంలోకి వచ్చాక అవినీతి రహిత పాలన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏపార్టీలో చూసినా తెలుగు దేశం యూనివర్సిటీ నుంచి వెళ్లిన నాయకులే ఉంటారని.. టీడీపీ నాయకులను తయారు చేసే పార్టీ అన్నారు. మృతి చెందిన పార్టీ కార్యకర్తలకు, నేతలకు మహానాడు వేదికగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో 1,033 మంది చనిపోయినట్లు సోమిశెట్టి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి మహానాడులో సంతాపం తెలిపారు.

పెద్ద నోట్లు రద్దు చేయండి

దేశ విదేశాల నుంచి సైతం టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన సభా వేదికగా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. **దేశంలో పెద్ద నోట్లన్నీ రద్దు చేయాలని కేంద్రానికి ఆయన సూచించారు. డిజిటల్‌ కరెన్సీ వచ్చాక పెద్ద నోట్ల అవసరం లేదని.. వాటి రద్దుతోనే అవినీతిని అరికట్టగలమని సీఎం చంద్రబాబు అన్నారు. గతంలోనే డిజిటల్ కరెన్సీకి మద్దతుగా ప్రధానికి విజ్ఞప్తి చేశానని చంద్రబాబు గుర్తు చేశారు. రూ. 1000, రూ.500 నోట్లు రద్దు చేసి కొత్తగా రెండు వేల నోటు తెచ్చారని.. ఇప్పుడు పరిస్థితుల్లో అవసరమైతే రూ. 500 సహా అన్ని పెద్ద నోట్లను రద్దు చేయాలని ఏపీ సీఎం కేంద్రానికి సూచించారు. పెద్దనోట్లే అవినీతి మూలమని.. నోట్ల రద్దు ద్వారానే నిజమైన పారదర్శకత సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags

Next Story