Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ వెనుక అసాంఘీక కార్యకలాపాలు..

Andhra University: ఎంతో ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారడం సంచలనంగా మారింది. AU ఇంజినీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వెనుక ఉన్న పొదల్లో, ఏకంగా ఓ మినీ డెన్‌నే ఏర్పాటు చేసి వ్యభిచారం, మందు పార్టీలకు వేదికగా చేసేశారు. వర్సిటీ సుందరీకరణ పనుల కోసం హాస్టల్ వెనుక పొదల్ని తొలగించి ఆ ప్రాంతం శుభ్రం చేస్తుంటే ఈ అరాచకం అంతా వెలుగు చూసింది.
అక్కడ వెదురు, ఇతర చెట్లు దట్టంగా పెరగడంతో ఆ చెట్లపైనే ఓ మంచె ఏర్పాటు చేసేశారు. వాటిపై ఏకంగా పరుపులు కూడా వేశారు. పైకి ఎక్కడానికి నిచ్చెన కూడా పెట్టారు. దట్టమైన పొదల కారణంగా.. ఇక్కడేం ఉందో బయటకు తెలిసే అవకాశం లేకపోవడంతో ఇదే అదునుగా దీన్నో వ్యభిచార కేంద్రంగా కూడా మార్చినట్టు అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది.
ఎక్కడ చూసినా కండోమ్‌లు, సిగరెట్ ప్యాకెట్లు, మందు బాటిళ్లే కనిపించాయి. ఈ పొదల దగ్గర కొన్ని వందల కండోమ్ ప్యాకెట్లు దొరికాయి అంటే.. ఇక్కడేం జరుగుతుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సెక్యూరిటీ సిబ్బంది ఇన్నాళ్లూ దీన్ని ఎందుకు గుర్తించలేకపోయారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పొదల దగ్గర మద్యం బాటిళ్లతోపాటు కొన్ని సిరెంజ్‌లు కూడా గుర్తించారు.
డ్రగ్స్ ఇంజెక్షన్లను తీసుకునేందుకే వీటిని ఉపయోగించారా, ఈ ప్రాంతం డ్రగ్స్ దందాకి కూడా అడ్డాగా మారిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏజెన్సీ నుంచి విచ్చలవిడిగా వస్తున్న గంజాయికి కూడా యువత బానిసైనట్టే ఇప్పుడు డ్రగ్స్ ఆనవాళ్లు కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. క్యాంపస్ వెనుకున్న ఈ మంచె వద్దకు ఈ సెటప్ అంతా సిద్ధం చేసింది ఎవరు.. దీంతో ఎవరెవరికి సంబంధం ఉంది అనేదానిపై విచారణ జరుగుతోంది.
క్యాంపస్‌లోకి వందలాది మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయి.. గుట్టల కొద్దీ కండోమ్ ప్యాకెట్స్ దొరకడం ఏంటి.. డ్రగ్స్ సిరెంజ్‌లు పడి పడిఉన్నాయంటే అసలేం జరుగుతోంది.. ఇప్పుడీ పరిణామాలన్నీ తల్లిదండ్రుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com