Mandus Cyclone: తీరం దాటిన మాండూస్.. ఏపీపై భారీ ప్రభావం

Mandus Cyclone: మాండూస్ తుఫాన్ తీరం దాటింది.. విలయం సృష్టిస్తోంది.. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటిందని ఐఎండీ తెలిపింది… సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉంది. ఇది కోస్తా తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షపాతాన్ని ప్రభావితం చేసింది. మహాబలిపురంకు వాయవ్యంగా 70కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
ఉత్తర తమిళనాడుపై కొనసాగుతూ మధ్యాహ్నానికి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా వేసింది. తీరం వెంబడి 55కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. నేడు తమిళనాడుతో పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో చలిగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక, ఈ తుఫాన్ ఏపీపై భారీ ప్రభావాన్ని చూపిస్తోంది..
తుఫాన్ ప్రభావంతో ఈరోజు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాను తీరం దాటడంతో రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్నారు. మాండస్ తుఫాన్ ప్రభావంతో జనజీవనం స్తంభించిపోయింది.
ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 19 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలికి జనం వణికిపోయారు. నెల్లూరు జిల్లావ్యాప్తంగా 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచడంతో పాటు వర్షాలు పడ్డాయి. గూడూరు డివిజన్లో 73మి.మీ వర్షపాతం నమోదైంది. వాకాడు, కోట మండలాల్లో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది.
తుఫాన్ ప్రభావంతో తిరుమలలో వర్షం కురుస్తూనే వుంది.దీంతో యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. యాత్రికులు చాలావరకూ కాటేజీలకే పరిమితమవడంతో సందర్శనీయ ప్రదేశాలు బోసిపోయాయి.ఘాట్‌రోడ్లలో కొండచరియలు విరిగిపడే అవకాశముండడంతో ఇంజనీరింగ్, ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. తరచూ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఘాట్‌రోడ్లలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.
గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట డివిజన్లలో పలుచోట్ల వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. వరిపంట నీటమునిగింది. తిరుపతిలో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.రేణిగుంట రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వర్షపునీరు చేరింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com