15 రోజుల్లో పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో..

మూడు ముళ్లు పడక ముందే ఓ జంట జీవితం ముగిసిపోయింది. మేరిమాతను సందర్శించుకుందామని బైక్‌పై బయల్దేరిన ఆ జంటను వెనుక నుంచి వచ్చిన లారీ పొట్టన పెట్టుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్ (25), కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవాని (18)లకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మే 10న వివాహ ముహూర్తం నిర్ణయించారు ఇరు కుటుంబాల పెద్దలు.
కాబోయే దంపతులు ఇద్దరూ కలిసి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయాన్ని సందర్శించేందుకు బైక్‌పై బయల్దేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తమ కళ్ల ముందే తమ బిడ్డల జీవితం ముగిసిపోయిందని తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com