AP: స్థానిక విద్యార్థులతోనే వైద్య అన్-రిజర్వుడు సీట్ల భర్తీ

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడు సీట్లను స్థానికుల విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. దీంతో దాదాపు 200 ఎంబీబీఎస్ సీట్లు స్థానిక కోటాలో అదనంగా వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా విభజన తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని అన్ని సీట్లను స్థానిక విద్యార్థులకే కేటాయిస్తామని ప్రకటించిన తరువాతి రోజే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం నేపధ్యంలో పాత జీఓలను సవరించి, లోకల్‌గానే అన్‌రిజర్వుడు సీట్ల భర్తీకి సంబందించిన అంశంపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుతో..మెడికల్ యూనివర్శిటి వీసీ, ప్రొఫెసర్లు చర్చలు జరిపారు.
ఇక ఆల్ ఇండియా కోటా కింద ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల వారీగా ఉన్న సీట్లలో 15 శాతం భర్తీ చేస్తున్నారు.మిగిలిన సీట్లను వంద శాతం కింద పరిగణించి 85 శాతం లోకల్, 15శాతం అన్‌రిజర్వుడు కేటగిరిలో భర్తీ చేస్తున్నారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 50శాతం సీట్లను మాత్రమే కన్వీనర్ కోటా కింద భర్తీచేస్తున్నారు.ఇందులోనే 15 శాతం సీట్లను అన్‌రిజర్వుడు కేటగిరికి కేటాయిస్తున్నారు. ఈ కేటగిరిలో తెలంగాణ విద్యార్థులూ సీట్లు పొందేవారు అయితే సర్కార్ కొత్త నిర్ణయంతో మొత్తం కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లను స్థానికులకే ఇవ్వనున్నారు.
మరోవైపు రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మరో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించేందుకు వీలుగా ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆదోని, పాడేరు, పులివెందులలో ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభానికి అనుమతి కోరుతూ ఎన్‌ఎంసీకి ఈ ఏడాది చివర్లో దరఖాస్తు చేయాలని నిర్ణయించారు.
అటు భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా న్యాయ శాఖ సలహా తీసుకోనున్నారు. తెలంగాణలో లాగా ఏపీలో ఓపెన్ కేటగిరీ రద్దుపై వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. తెలంగాణలో మెడికల్ సీట్లన్నీ మొత్తం ఒకే రీజియన్ పరిధిలో ఉంటాయి. స్థానికత ప్రకారం సీట్ల భర్తీ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే ఉంటుంది. ఏపీలో ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని రెండు రీజియన్లు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com