CHIRU: చిరంజీవికి పద్మ విభూషణ్‌

CHIRU: చిరంజీవికి పద్మ విభూషణ్‌
కోట్లమంది అభిమానుల గుండెల్లో అన్నయ్యగా చెరగని ముద్ర.... అత్యున్నత పురస్కారంపై మెగాస్టార్‌ హర్షం

కళారంగంలో అత్యున్నత సేవలకుగాను మెగాస్టార్ చిరంజీవికి మరోసారి పద్మ పురస్కారం దక్కింది. 2024 సంవత్సరానికిగాను చిరంజీవిని పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో కథానాయకుడిగా తన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో అన్నయ్యగా చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. విమర్శకుల ప్రశంసలందుకుంటూనే ఎన్నో రికార్డులను సృష్టించారు. కొణిదెల శివశంకర వరప్రసాద్‌గా చిత్రసీమలోకి అడుగుపెట్టి... వెండితెరపై చిరంజీవిగా వెలుగొందిన ఆయన... కృషి, పట్టుదలతో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 1978లో ‘పునాది రాళ్లు’ సినిమాతో తెలుగు చిత్రసీమలో బలమైన పునాది వేసుకున్నారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ... హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.


1983లో వచ్చిన ఖైదీ సినిమా చిరంజీవి నట ప్రస్థానంలో మైలురాయిగా నిలిచింది. తిరుగులేని మాస్ ఇమేజ్, స్టార్‌డమ్‌ సంపాదించుకున్న చిరు.. తనదైన శైలి డ్యాన్స్, డైలాగ్స్‌తో అలరించారు. ప్రజారాజ్యం పేరుతో పార్టీని పెట్టిన ఆయన... కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. మళ్లీ ఖైదీ నంబర్ 150తో వెండితెరపై రీ ఎంట్రీఇచ్చారు. ఇప్పటివరకు 150కిపైగా సినిమాల్లో నటించారు. తమిళం, కన్నడ, హిందీలోనూ చిరంజీవి నటించారు. ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్’ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు చిరంజీవే. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి కేంద్ర ప్రభుత్వం నుంచి 'సమ్మాన్ ’అవార్డు అందుకున్నారు.


సినిమాలతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ మెగాస్టార్ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది పేదలకు అండగా నిలిచారు. కరోనా సమయంలో సినీ కార్మికులను ఆదుకొని వారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. మెగాస్టార్‌కు అవార్దులు రివార్డులు కొత్తేంకాదు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గతేడాది గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డును కేంద్రం ప్రదానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు నంది అవార్డులు, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు చిరంజీవిని వరించాయి. తాజాగా దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల చిరంజీవి హర్షం వ్యక్తంచేశారు. అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానని, ఈ గౌరవం వారిదేనని చిరంజీవి తెలిపారు.

Tags

Next Story