Praja Darbar: ప్రజాదర్బార్‌కు నేటితో 50 రోజులు..

Praja Darbar: ప్రజాదర్బార్‌కు నేటితో 50 రోజులు..
X
కష్టం ఏదైనా అండగా లోకేశ్

ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ నేటికి 50 రోజులు పూర్తిచేసుకుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ ప్రజాదర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తోంది. వైసీపీ పాలనలో సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి గోడు ఆలకించిన వారు లేరు. తమ కష్టాలు చెప్పుకుందామని తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకున్న బాధితులను నిర్దాక్షణ్యంగా బయటకు నెట్టి గేట్లు వేసిన పరిస్థితి. అప్రజాస్వామిక పాలనను అంతమొందించాలని ప్రజలు సంకల్పించారు. దీంతో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్యులకు అండగా నిలుస్తోంది. వారి కష్టాలను విని పరిష్కరించేందుకు లోకేశ్ పదవీ బాధ్యతలు చేపట్టిన మూడో రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు 50 ప్రజాదర్బార్‌లు నిర్వహించి బాధితుల కన్నీరు తుడిచారు.

ప్రజాదర్బార్‌లో వచ్చిన విజ్ఞప్తుల్లో 75శాతం పరిష్కారం

గతంలో పలువురు ప్రజాప్రతినిధులు నిర్వహించిన ప్రజాదర్బార్‌లకు విభిన్నంగా మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ కొనసాగుతోంది. ప్రజాదర్బార్‌లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటివరకు 75శాతం సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలను పరిష్కరించారు. 1,410 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50 శాతం వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి. ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీ‌రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి. భూవివాదాలకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందగా అర్హతలను బట్టి 347 మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు.

Tags

Next Story