AP: స్వర్ణాంధ్రకు రోడ్ మ్యాప్ ఈ "బడ్జెట్"

ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి పునాదిలా బడ్జెట్ నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీసీ వర్గాల సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మే నుంచి మొదలయ్యే సూపర్ సిక్స్ పథకాలకు భారీ కేటాయింపులు చేసినట్లు చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనకు రోడ్‌మ్యాప్‌గా నేటి బడ్జెట్ నిలుస్తుందన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్న అన్నారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా తమ ప్రభుత్వం నిత్యం పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి పునాదిలా నిలుస్తుందని దృఢంగా నమ్ముతున్నా అన్నారు. బడ్జెట్ అంటే కేవలం ఆయా శాఖలకు చేసే కేటాయింపులుగానే చూడకుండా, రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి అవసరమయ్యే విధంగా కేటాయింపులు జరిపామన్నారు.
సంక్షేమం.. సుస్థిర అభివృద్ధే లక్ష్యం: పవన్
2025-26 ఆర్థిక వార్షిక పద్దు సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందని వెల్లడించారు. బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందన్నారు. సూపర్‌సిక్స్ హామీల అమలుకు తగిన కేటాయింపులు జరిపారని పవన్ కల్యాణ్ తెలిపారు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేయడం కూటమి ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తుందన్నారు.
ఏపీ భవిష్యత్తు బడ్జెట్: నాదెండ్ల
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంపై లోతుగా అవగాహన వచ్చాక ఏపీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉన్న బడ్జెట్‌ను జనసేన పార్టీ స్వాగతిస్తుందన్నారు. బడ్జెట్ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ అమలు అయ్యే విధంగా నిధుల కేటాయింపులు ఉన్నాయన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి ఊతం
ఏపీ పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ఉండడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయం అన్నారు. గతంలో సంక్షేమానికి నిధులు కేటాయించి ఇతర అవసరాలకు మళ్లించి బడుగు బలహీనవర్గాలను దగా చేశారని మంత్రి మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com