AP: నాపై జరిగింది హనీట్రాప్.. కోర్టులో ఆదిమూలం పిటిషన్
టీడీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టేయాలని పోలీసులను ఆదేశించాలంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా.. ఆరోపణల్లో నిజానిజాలు శోధించకుండా పోలీసులు కేసు నమోదు చేశారని కోనేటి ఆదిమూలం ఆరోపించారు. జులై, ఆగస్ట్ నెలల్లో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా ఇప్పుడెందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై జరిగింది హనీట్రాప్ అంటూ ఆదిమూలం పిటిషన్‌లో పేర్కొన్నారు. 72 ఏళ్ల వయసులో తాను గుండెకు స్టెంట్ వేయించుకున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు. మహిళ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేల్చకుండా పోలీసులు కేసు నమోదుచేశారని.. దీనిని కొట్టివేసేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
బాధిత మహిళ సంచలన ఆరోపణలు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను బెదిరించి లొంగదీసుకున్నారంటూ ఓ మహిళా నేత ఇటీవల ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు విడుదల చేశారు. కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి.. తనపై అత్యాచారం చేశారంటూ బాధితురాలు ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లకు కూడా తెలియజేశానని చెప్పారు. అలాగే తనపై తిరుపతిలోని ఓ హోటల్‌లో అఘాయిత్యం జరిగిందంటూ తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే సస్పెన్షన్ వేటు
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వీడియోలు విడుదల కావటంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన చంద్రబాబు నాయుడు.. కోనేటి ఆదిమూలాన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇక అధినేత ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. కోనేటి ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఘటన వెనుక తన తప్పులేదని కోనేటి ఆదిమూలం చెప్తున్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక వైసీపీ చేసిన కుట్ర అంటూ ఆరోపిస్తున్నారు. తాజాగా ఇది హనీట్రాప్ అంటూ హైకోర్టులో పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com